సాకర్‌ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్‌! | Football Fans Shocked After Seeing Ticket Prices Hike By FIFA | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: సాకర్‌ సంగ్రామం ముంగిట అభిమానులకు షాక్‌!

Apr 11 2026 11:24 AM | Updated on Apr 11 2026 12:24 PM

Football Fans Shocked After Seeing Ticket Prices Hike By FIFA

మ‌రో రెండు నెల‌ల్లో సాక‌ర్ మ‌హాసంగ్రామం మొద‌లుకానుంది. జూన్ 11 నుంచి ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుండ‌డంతో టోర్నీకి సంబంధించి పాల్గొన‌బోయే జ‌ట్లు, మ్యాచ్ షెడ్యూల్ వివ‌రాల‌ను ఇప్ప‌టికే  ఫిఫా స‌మాఖ్య విడుద‌ల చేసింది. అయితే ఫుట్‌బాల్ ఆటను మైదానంలో వీక్షిస్తే వ‌చ్చే మజానే వేరు. 90 నిమిషాల్లో ముగిసిపోయే మ్యాచ్ చూసేందుకు అభిమానులు తండోప‌తండాలుగా వ‌స్తుం టారు. 

సాక‌ర్ ఫీవ‌ర్ ఉన్న‌న్నాళ్లు స్టేడియాల‌న్నీ ప్రేక్ష‌కుల‌తో కిక్కిరిసిపోవ‌డం ఖాయం. కానీ 2026 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు సంబంధించి టికెట్ల ధ‌ర‌ల విష‌యం మాత్రం ఒక ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈసారి టికెట్ రేట్ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతుండ‌డంతో సాధార‌ణ అభిమానుల‌కు మ్యాచ్ వీక్షించ‌డం సాధ్య‌మ‌య్యేనా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.  

ఈ ఏడాది ప్రపంచ కప్ టికెట్ల ధరలను ఫిఫా భారీగా పెంచేసింది. ఇప్పటికే ఉన్న కేటగిరీలకు తోడు కొత్తగా ‘ఫ్రంట్ కేటగిరీ’ పేరుతో మరింత ఖరీదైన టిక్కెట్లను ప్రవేశపెట్టింది. దీంతో మ్యాచ్‌ల‌ను ప్రత్యక్షంగా వీక్షించడం సాధారణ అభిమానులకు ఖరీదైన వ్యవహారంగా మారనుంది. 

జూన్ 12న అమెరికాలోని ఇంగిల్‌వుడ్‌లో జరిగే అమెరికా ఆరంభ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ముందువరుసలోని ‘ఫ్రంట్ కేటగిరీ’ ఒక టికెట్ ధర 4,105 డాల‌ర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.3.4 లక్షలు . గతంలో ఇదే కేటగిరీ గరిష్ట ధర 2,735 డాల‌ర్లు (సుమారు రూ.2.25 లక్షలు)గా ఉండేది. ఇప్పుడు కొత్త కేటగిరీలతో ధరలు మరింత పెరిగాయి.

అదేవిధంగా, ఫీఫా కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఫ్రంట్ కేటగిరీ 2’టికెట్ల ధరలు 1,940 నుంచి 2,330 డాలర్ల వరకు ఉన్నాయి. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.1.6 లక్షల నుంచి రూ.1.9 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కెనడా ఆరంభ మ్యాచ్‌కు కూడా ఫ్రంట్ కేటగిరీ ఒక టికెట్‌ ధర 3,360 (సుమారు రూ.2.8 లక్షలు)గా నిర్ణయించారు. 

రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు కూడా ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఫిలడెల్ఫియాలో జరిగే మ్యాచ్‌కు టికెట్ ధర 905 డాలర్లు (సుమారు రూ.75,000)గా ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే, టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.న్యూజెర్సీలోని మెట్అఫ్ స్టేడియంలో జూలై 19న జరిగే ఫైనల్ మ్యాచ్ టికెట్ గరిష్ట ధర 10,990 డాలర్లుగా నిర్ణయించగా, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.9 లక్షలకు పైగా ఉంటుంది. 

డిసెంబర్ లో ఇదే టికెట్ ధర 8,680 డాలర్లు (సుమారు రూ.7.20 లక్షలు)గా ఉండేది. అదే విధంగా, కేటగిరీ 2 టికెట్లు 5,575 నుంచి 7,380 డాలర్లు (రూ.4.6 లక్షలు – రూ.6.1 లక్షలు), కేటగిరీ 3 టికెట్లు 4,185 నుంచి 5,785 డాలర్లు (రూ.3.5 లక్షలు - రూ.4.8 లక్షలు) వరకు పెరిగాయి. మొత్తం మీద యుద్ధం ప్రభావం, ఆర్థిక అనిశ్చితి ఫిఫా ప్రపంచకప్ టికెట్ ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పొచ్చు. 

ప్రీమియం అనుభవం పేరుతో ఫిఫా కొత్త కేటగిరీలను తీసుకువచ్చినప్పటికీ, సాధారణ అభిమానులకు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడం కష్టతరంగా మారింది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.

చదవండి: ‘అడ్డుగోడలా నిలబడితే విజయం ఎలా వస్తుంది?’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement