
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ పురుషుల జట్టుకు కొత్త వైస్ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ తరంగం హ్యారీ బ్రూక్ ఇకపై పరిమిత ఓవర్ల జట్టుకు ఉప నాయకుడిగా పనిచేస్తాడని మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు బ్రూక్ నియామకానికి సంబంధించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మూడేళ్ల నుంచి అదరగొడుతున్నాడు
కాగా 2022లో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది సౌతాఫ్రికాతో సిరీస్‌లో భాగంగా టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.
ఇక 25 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 24 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ టీ20లలో అతడి సగటు 30.73.. స్ట్రైక్‌రేటు 146.07. వన్డేల్లో బ్రూక్ సగటు 39.94.. స్ట్రైక్‌రేటు 106.83. మూడేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్‌లో టెస్టుల్లో ఎనిమిది, వన్డేల్లో ఒక శతకం సాధించాడు.
బట్లర్ వారసుడిగా
ఇలా అద్భుత ప్రదర్శనతో మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకుంటున్న బ్రూక్‌ను వైస్ కెప్టెన్ పదవి వరించింది. బట్లర్ వారసుడిగా అతడిని చూస్తున్న యాజమాన్యం భవిష్యత్తులో సారథిగా నియమించాలనే యోచనలో ఉన్నట్లు తాజా ప్రకటన స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయమై ఊహాగానాలు రాగా.. బ్రూక్ మాత్రం పెద్దగా స్పందించలేదు.
ఐపీఎల్ ద్వారా భారత అభిమానులకు చేరువగా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ హ్యారీ బ్రూక్ ఆడుతున్నాడు. 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడు క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్‌లో మొత్తంగా 11 మ్యాచ్‌లు ఆడి.. 190 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టింది.
ఈ క్రమంలో 2024 ఎడిషన్‌కు గానూ ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్‌ను కొనుగోలు చేసింది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సీజన్ మొత్తానికి అతడు దూరంగానే ఉన్నాడు. అయినప్పటికీ ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడిపై మరోసారి నమ్మకం ఉంచింది. 2025 మెగా వేలం సందర్భంగా రూ. 6.25 కోట్లకు హ్యారీ బ్రూక్‌ను సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా ఇంగ్లండ్‌కు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. జనవరి 22 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది.
జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2న పొట్టి ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగనుండగా.. ఫిబ్రవరి 6,9, 12 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది. కోల్‌కతా, చెన్నై, రాజ్‌కోట్, పుణె, ముంబై, టీ20లకు.. నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్ వన్డేలకు ఆతిథ్యం ఇస్తాయి. ఇక ఇప్పటికే ఈ సిరీస్‌ల కోసం భారత్- ఇంగ్లండ్ బోర్డులు తమ జట్లను ఖరారు చేశాయి.
చదవండి: Ind vs Eng: భారత తుదిజట్టులో వీరే.. ఆ ప్లేయర్లు బెంచ్‌కే పరిమితం!
Comments
Please login to add a commentAdd a comment