మార్చి 7, 8 తేదీల్లో నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు సెంచరీలు కొట్టనున్నారు. ఇదేంటని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. పై పేర్కొన్న తేదీల్లో ఓ భారత ఆటగాడు, ఓ ఇంగ్లండ్ ఆటగాడు, ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లు టెస్ట్‌ల్లో వందో మ్యాచ్ ఆడనున్నారు.
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్‌స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది.
ఈ తేదీల కంటే ముందు ఫిబ్రవరి 15న మరో ఆటగాడు కూడా సెంచరీ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్‌కు వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. రోజుల వ్యవధిలో ఐదుగురు ఆటగాళ్లు వంద టెస్ట్‌ల మార్కును తాకడం చాలా అరుదుగా జరుగుతుంది.
ఈ ఆటగాళ్లతో పాటు మరికొందరు శతాధిక టెస్ట్ ప్లేయర్లు ఒకేసారి రిటైరైతే టెస్ట్ క్రికెట్‌లో ఓ శకం ముగిసినట్లవుతుంది. నేటి వరకు (ఫిబ్రవరి 13) పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి.
- బెన్ స్టోక్స్- 99 టెస్ట్‌ల్లో 13 సెంచరీలు, 6251 పరుగులు, 197 వికెట్లు
- జానీ బెయిర్‌స్టో- 97 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 5902 పరుగులు
- రవింద్రన్ అశ్విన్- 97 టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 3271 పరుగులు, 499 వికెట్లు
- కేన్ విలియమ్సన్- 98 టెస్ట్‌ల్లో 31 సెంచరీలు, 8490 పరుగులు, 30 వికెట్లు
- టిమ్ సౌథీ-98 టెస్ట్‌ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2059 పరుగులు, 375 వికెట్లు
టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్‌ల మార్కును తాకారు.
Comments
Please login to add a commentAdd a comment