ఎన్ని అవాంతరాలొచ్చినా ఐపీఎల్ సీజన్–13 జరగడం ఖాయమైంది. కరోనా కబళిస్తున్నా... భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నా, ఉన్నపళంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లినా లీగ్ నిర్వహణకే బీసీసీఐ మొగ్గు చూపింది. నిర్వహణపై అమితాసక్తితో ఎదురు చూసిన ఫ్రాంచైజీలకు యూఏఈలో టోర్నీ జరగడం మొత్తం ఆర్థికంగా నష్టపరిచే అంశం. వారి ఆదాయంపై పెద్ద ఎత్తున దెబ్బ పడనుంది. అయితే పూర్తిగా లీగ్ రద్దు కావడంతో పోలిస్తే ఎంతో కొంత ఆదాయం రానుండటం ఊరట కలిగించే అంశం.
సాక్షి క్రీడా విభాగం: ఐదేళ్లకు ఏకంగా రూ. 2199 కోట్ల భారీ డీల్... సాలీనా రూ. 440 కోట్ల చెల్లింపులు... ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం వివో 2017లో చేసుకున్న ఒప్పందం ఇది. ఐపీఎల్ రెవిన్యూ షేరింగ్ అగ్రిమెంట్‌లో ఫ్రాంచైజీలకు టైటిల్ స్పాన్సర్‌షిప్ అనేది కీలక ఆదాయ వనరు. మొత్తం టైటిల్ స్పాన్సర్‌షిప్‌లో సగభాగం (దాదాపు 1000 కోట్లు) లీగ్‌లోని 8 ఫ్రాంచైజీలకు అందజేస్తారు. అంటే ఏడాదికి రూ. 20 కోట్లకు పైగానే ఫ్రాంచైజీలు ఆర్జిస్తున్నాయి. రాజకీయ కారణాలతో చైనా మూలాలున్న వివో తప్పుకోవడంతో ఆ ప్రభావం ఫ్రాంచైజీలపై పడనుంది. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ‘వివో’ ఇచ్చే మొత్తాన్నే ఇవ్వగల కొత్త స్పాన్సర్ దొరకడం కష్టమే. మరోవైపు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తుండటంతో టిక్కెట్ల విక్రయం ద్వారా లభించే గేట్ రెవెన్యూ కూడా ఫ్రాంచైజీలు కోల్పోనున్నాయి.
మీడియా హక్కులే ఆలంబన...
ప్రస్తుతం ఫ్రాంచైజీల్ని లీగ్ నిర్వహణ వైపు నడిపిస్తోన్న ఆదాయ వనరు మీడియా హక్కులు. ఈ హక్కుల్ని స్టార్ ఇండియా యాజమాన్యం 2017లో రికార్డు మొత్తానికి సొంతం చేసుకుంది. ఐదేళ్ల కాలానికి రూ. 16,347 కోట్లతో ఈ ఒప్పందం కుదిరింది. క్రికెట్ మీడియా హక్కుల ఒప్పందంలో చరిత్ర సృష్టించిన ఈ భారీ డీల్‌తో ఫ్రాంచైజీలు ఏటా రూ. 150 కోట్లు ఆర్జిస్తున్నాయి. ఈ మీడియా హక్కుల ఫలితంగా ప్రతి సీజన్‌కు రూ. 50 కోట్లు లాభం ఉంటుందని అంచనా.
ఇతర ఆదాయ మార్గాల్లోనూ కోత!
మీడియా హక్కులతో పాటు కిట్, జెర్సీ, హెల్మెట్లకు వేరు వేరు సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తుంటాయి. వీటి ద్వారా ఫ్రాంచైజీలు సీజన్‌కు రూ. 45–50 కోట్లు ఆర్జిస్తున్నాయి. అయితే గత సీజన్‌లో ఒక జట్టుకు రూ. 33 కోట్లు ఆదాయాన్ని సమకూర్చిన ఒక ప్రధాన స్పాన్సర్... ఈ సారి అంత మొత్తం ఇవ్వలేమంటూ సంప్రదింపులకు దిగింది. మిగతా జట్లకూ ఇదే అనుభవం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కరోనా కారణంగా ఈ సారి ఈ ఆదాయంలో కూడా గండిపడే అవకాశముంది.
ఖర్చులు అదనం
యూఏఈలో జరిగే టోర్నీ కోసం ఆటగాళ్ల భద్రత దృష్ట్యా చార్టెడ్ ఫ్లయిట్స్‌ను ఫ్రాంచైజీలు వినియోగించనున్నాయి. లీగ్ జరిగినన్ని రోజులు ఆటగాళ్ల వసతి, వారుండే హోటళ్లలో బయో సెక్యూర్ పరిస్థితుల ఏర్పాటు, రవాణా వీటన్నింటికి భారీగా ఖర్చయ్యే అవకాశముంది. వీటి కోసమే దాదాపు రూ. 10–12 కోట్లు ఖర్చయ్యే అవకాశముందని ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి. భారత్‌లో ఖర్చుతో పోలిస్తే ఇది 50–60 శాతం అదనం.
మరో వైపు టికెట్లు అమ్మకపోవడం ద్వారా తాము కోల్పోయే ‘గేట్ రెవెన్యూ’కు నష్టపరిహారం చెల్లించాలంటూ ఫ్రాంచైజీలు చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ నిర్ద్వద్వంగా తిరస్కరించింది. అదే విధంగా ఈ ఏడాది మ్యాచ్‌లు జరగకపోయినా దేశంలో ఎనిమిది ఐపీఎల్ జట్లకు కేంద్రాలుగా ఉన్న రాష్ట్ర సంఘాలకు ప్రతీ ఏటా ఒక్కో ఫ్రాంచైజీ చెల్లించే రూ. 8 కోట్లు (మొత్తం రూ. 64 కోట్లు) కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని దిగువ స్థాయి క్రికెట్‌ను ప్రోత్సహిస్తేందుకు ఉపయోగిస్తామని, ఈ డబ్బు లేకపోతే ఆయా సంఘాల్లో క్రికెట్ దెబ్బ తింటుందని బోర్డు అభిప్రాయ పడింది.
Comments
Please login to add a commentAdd a comment