franchises
-
IPL 2024: ఏప్రిల్ 16న ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ భేటి
వచ్చే ఏడాది ఐపీఎల్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చించేందుకు బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీల ఓనర్లతో భేటి కానున్నట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ ఏప్రిల్ 16న అహ్మదాబాద్‌లో జరుగనున్నట్లు సమాచారం. 2025 సీజన్‌కు సంబంధించి మెగా వేలం, ఆటగాళ్ల రిటెన్షన్, పర్స్ వ్యాల్యూ తదితర అంశాలు అజెండాగా ఉండవచ్చని తెలుస్తుంది. గతేడాది మినీ వేలంలో 100 కోట్లకు పెరిగిన ఫ్రాంచైజీ పర్స్ వ్యాల్యూ రానున్న సీజన్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, 2024 ఐపీఎల్ సీజన్ రసపట్టుగా సాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 13 మ్యాచ్‌లు అభిమానులకు కావల్సినంత మజాను అందించాయి. ఈ సీజన్లో ఇంకా 61 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేకేఆర్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సీఎస్కే, రాజస్థాన్, గుజరాత్, సన్‌రైజర్స్, లక్నో, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ, ముంబై వరుస స్థానాల్లో ఉన్నాయి. వాంఖడే వేదికగా ఇవాళ (ఏప్రిల్ 1) ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. -
ఐపీఎల్‌పై ఆసక్తి చూపుతున్న క్రిస్టియానో రొనాల్డో జట్టు..!
Manchester United Owners Interested To Bid For Two IPL New Franchises: ఐపీఎల్-2022లో పాల్గొనే రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రపంచంలోనే సంపన్నమైన ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటైన మాంచెస్టర్ యునైటెడ్.. కొత్త ఐపీఎల్ జట్లలో ఒక దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం క్లబ్ యాజమాన్యమైన గ్లేజర్ కుటుంబం టెండర్ పత్రాలు సైతం కొనుగోలు చేసిందని సమాచారం. టెండర్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 20తో ముగినప్పటికీ.. సదరు క్లబ్ కోసం బీసీసీఐ చివరి తేదీని సైతం పొడిగించిందని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మాంచెస్టర్ క్లబ్ కొత్త ఐపీఎల్ జట్టును చేజిక్కించుకుంటే.. డబ్బుతో పాటు ఐపీఎల్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని బీసీసీఐ భావిస్తుంది. కాగా, స్టార్ ఫుట్‌బాలర్, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కొత్త ఫ్రాంచైజీల రేసులో అహ్మదాబాద్, లక్నో, గౌహతి, కటక్, ఇండోర్, ధర్మశాల వంటి నగరాలు ముందు వరుసలో ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్, టోరెంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఆర్పి-సంజీవ్ గోయెంకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, జిందాల్ స్టీల్ వంటి దేశీయ కంపెనీలు పోటీపడుతున్నాయి. వీటితో పాటు విదేశీ సంస్థలు కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొన వచ్చని బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఐపీఎల్ కొత్త జట్ల కొనుగోలు రేసులో నిలిచినట్లు తెలుస్తోంది. చదవండి: సండే బిగ్ మ్యాచ్.. మీరు ఒత్తిడిలో? మరి నా పరిస్థితి! -
అక్టోబర్ 17న రెండు ఐపీఎల్ కొత్త జట్లకు వేలం?
ముంబై: ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లు రాబోతున్నాయనే విషయం తెలిసిందే. ఇప్పటికే లీగ్ పాలక మండలి రెండు కొత్త ఫ్రాంచైజీలుకు టెండర్లు జారీ చేసింది. అక్టోబర్ 5న ఆ గడువు ముగుస్తుంది. ఈ క్రమంలో అక్టోబర్ 17 న కొత్తగా వచ్చే రెండు ఫ్రాంచైజీల కోసం వేలం నిర్వహించడానికి బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 17 ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ ప్రారంభమయ్యే రోజు కాబట్టి, మిడిల్ ఈస్ట్ నగరాల్లో ఒకటైన దుబాయ్ లేదా మస్కట్‌లో బిడ్డింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా గువాహటి, రాంచీ, కటక్, అహ్మదాబాద్, లక్నో, ధర్మశాల నగరాలను షార్ట్ లిస్ట్ చేశారు. వీటిల్లో నుంచి టెండర్లు వచ్చే రెండు నగరాలను ఎంపిక చేస్తారు. అయితే రెండు ఫ్రాంచైజీలకు గాను ఒక్కో దానికి కనీసం రూ.2000 కోట్లను బేస్ ప్రైస్‌గా నిర్ణయించారు. దీంతో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరుకోనుంది. చదవండి: MS Dhoni: పాక్‌పై బౌల్ అవుట్ విజయానికి 14 ఏళ్లు.. ధోని వ్యూహాలు ఫలించడంతో.. -
రెండు కొత్త జట్లు.. భారీ వేలం..మార్గదర్శకాలను సిద్ధం చేసిన బీసీసీఐ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆగస్టు 2021 నుంచి జనవరి 2022 మధ్యలో రెండు కొత్త ఫ్రాంచైజీలు, ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం, భారీ వేలం, జట్ల సాలరీ పర్స్ ఇంక్రిమెంట్, మీడియా హక్కులు తదితర అంశాలకు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి సెప్టెంబర్‌లో విక్రయం పూర్తి చేస్తామని వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో(డిసెంబర్) భారీ వేలాన్ని నిర్వహిస్తామని, అలాగే మరుసటి ఏడాది జనవరిలో ప్రత్యక్ష ప్రసారాల హక్కులకు టెండర్లు పిలుస్తామని బీసీసీఐ ప్రకటించింది. కొత్త ఫ్రాంచైజీల కొనుగోలు కోసం సంజీవ్ గోయెంకా గ్రూప్ (కోల్‌కతా), అదానీ గ్రూప్ (అహ్మదాబాద్), అరబిందో ఫార్మా (హైదరాబాద్), టొరెంట్ గ్రూప్ (గుజరాత్) సహా మరికొన్ని వ్యాపార సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అంశంపై కూడా బీసీసీఐ స్పష్టతనిచ్చింది. వేలానికి ముందు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లని రీటెయిన్ చేసుకోవచ్చని, ఇందులో ముగ్గురు భారతీయులు, ఒక విదేశీ ఆటగాడు లేదా ఇద్దరు భారతీయులు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చని పేర్కొంది. అలాగే ఆటగాళ్లకు చెల్లించే జీతాల నిధి మొత్తాన్ని రూ.85 నుంచి 90 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. మరోవైపు పది జట్లతో నిర్వహించే ఐపీఎల్ ప్రసార హక్కులు భారీ స్థాయిలో అమ్ముడు పోతాయని బీసీసీఐ అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఎనిమిది జట్లతో 60 మ్యాచులు నిర్వహిస్తుండగా, పది జట్లతో అయితే 90కి పైగా మ్యాచులు పైగా నిర్వహించే అవకాశం ఉంది. దాంతో 25% ఎక్కువ ధర లభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
‘బయో బబుల్’ దాటితే...
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఎట్టి పరిస్థితుల్లోనూ సురక్షిత పరిస్థితుల్లో నిర్వహించేందుకు, ఆటగాళ్లను బయో బబుల్ చట్రంలోనే ఉంచేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన మార్గదర్శకాలు రూపొందించింది. బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని లీగ్ నుంచి బహిష్కరించడంతో పాటు ఆయా జట్టుపై కోటి రూపాయల భారీ జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎనిమిది ఫ్రాంచైజీలకు బీసీసీఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా ఆటగాడు తొలిసారి బబుల్ నుంచి బయటకి వస్తే ఆరు రోజుల తప్పనిసరి స్వీయ నిర్బం«ధాన్ని పాటించాలని పేర్కొంది. రెండో సారి కూడా అదే తప్పు చేస్తే ఒక మ్యాచ్ సస్పెన్షన్... మూడో సారి నిబంధనలు అతిక్రమిస్తే లీగ్ నుంచి బహిష్కరిస్తామని వెల్లడించింది. అతని స్థానంలో మరో ఆటగాడిని కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. రోజూవారీ వైద్య పరీక్షలకు హాజరుకాకపోయినా, జీపీఎస్ పరికరాలు ధరించకపోయినా ఆటగాళ్లపై రూ. 60,000 జరిమానా విధించనుంది. ఈ నిబంధన క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు, జట్టు అధికారులకు కూడా వర్తిస్తుందని చెప్పింది. మరోవైపు ఈ అంశంలో ఫ్రాంచైజీలు కూడా ఉదాసీనంగా వ్యవహరించరాదని హెచ్చరించింది. బయటి వ్యక్తుల్ని బయో బబుల్‌లోకి అనుమతిస్తే తొలి తప్పిదంగా రూ. కోటి జరిమానా విధించనున్నట్లు తెలిపింది. రెండో సారి ఇదే పునరావృతమైతే ఒక పాయింట్, మూడోసారి కూడా తప్పు చేస్తే రెండు పాయింట్ల కోత విధిస్తామని చెప్పింది. ఆరోగ్య భద్రతా నిబంధనల్ని పదే పదే ఉల్లంఘిస్తున్న వారు బీసీసీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. యూఏఈలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రతీ ఐదు రోజులకొకసారి వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. -
బీసీసీఐకి ఐపీఎల్ ఫ్రాంచైజీల విజ్ఞప్తి
దుబాయ్: ఐపీఎల్ ప్రధాన టోర్నీకి ముందే మైదానంలో ప్రత్యర్థులతో తలపడే అవకాశం ఉంటే బాగుంటుందని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అందు కోసం అన్ని జట్ల మధ్య వామప్ మ్యాచ్‌లు ఏర్పాట్లు చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాయి. సాధారణంగా ప్రతీ టీమ్ తమ జట్టులోని ఆటగాళ్లనే రెండు బృందాలుగా చేసి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతూ ఉంటాయి. అయితే దీనికంటే ఇతర టీమ్‌లతో తలపడితే సరైన సాధన చేసినట్లు వారు భావిస్తున్నారు. కరోనా కారణంగా మార్చినుంచి క్రికెట్ ఆగిపోయింది. ఎవ్వరూ కూడా పోటీ క్రికెట్లో తలపడలేదు. అందుకే అసలు సమరానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లు తమకు సన్నాహకంగా పనికొస్తాయని ఒక ఫ్రాంచైజీ ప్రతినిధి అభిప్రాయ పడ్డారు. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై బోర్డునుంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. అయితే బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు దీనిపై భిన్నంగా స్పందించారు. ‘మాకు ఇప్పటికే అవసరానికి మించిన బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు మేం ఎక్కడ పెట్టుకుంటాం. నిజంగా అలాంటి ఆలోచనే ఉంటే ఫ్రాంచైజీ యజమానులు వారిలో వారు మాట్లాడుకొని తేల్చుకుంటే మంచిది. అందరికీ ఆసక్తి ఉండి ఆడుకుంటామంటే ఎవరు వద్దంటారు’ అని ఆయన అన్నారు. సెప్టెంబర్ 19న ఐపీఎల్ ప్రారంభం కానుంది. -
నష్టపరిహారం ఇచ్చే సమస్యే లేదు
ముంబై: ఐపీఎల్ భారత్‌లో జరగకపోవడంతో ఈ ఏడాది తాము నష్టపోతున్న మొత్తాన్ని బీసీసీఐ సర్దుబాటు చేయాలంటూ ఫ్రాంచైజీలు చేస్తున్న డిమాండ్‌పై బోర్డు అసహనం వ్యక్తం చేసింది. కరోనా ప్రభావం గురించి అందరికీ తెలుసని, ఇటువంటి స్థితిలో ఇలాంటి డిమాండ్లు అర్థరహితమని బోర్డు వర్గాలు చెప్పాయి. ఒక ఫ్రాంచైజీ తమ నష్టాన్ని రూ. 46 కోట్లుగా చూపిస్తూ బోర్డుకు లేఖ రాసింది. ‘అసలు ఈ ఏడాది ఐపీఎల్ జరగడమే గొప్ప. అదీ లేకపోతే వారంతా ఏం చేసేవారు. అర్థం లేని డిమాండ్లు చేస్తారా. అయితే ఈసారి కూడా ఒక్కో ఫ్రాంచైజీకి కనీసం రూ. 150 కోట్లు వస్తాయి. ఇదంతా మాకు తెలీదా. ఇలా చిల్లర లెక్కలు చేస్తారా’ అని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు తమ అర్థరహిత సందేహాలు తీర్చమంటూ కూడా వారు కోరుతున్నారని ఆయన చెప్పారు. ‘తమ వెంట ఎంత మంది కుటుంబ సభ్యులను, మిత్రులను తీసుకు రావచ్చని ఫ్రాంచైజీలు అడుగుతున్నాయి. కరోనా ఆటగాడి బంధువా, చుట్టమా అని అడిగి రాదు కదా. అవన్నీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. -
'దుబాయ్' భారం..!
ఎన్ని అవాంతరాలొచ్చినా ఐపీఎల్ సీజన్–13 జరగడం ఖాయమైంది. కరోనా కబళిస్తున్నా... భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నా, ఉన్నపళంగా భారీ ఆర్థిక నష్టం వాటిల్లినా లీగ్ నిర్వహణకే బీసీసీఐ మొగ్గు చూపింది. నిర్వహణపై అమితాసక్తితో ఎదురు చూసిన ఫ్రాంచైజీలకు యూఏఈలో టోర్నీ జరగడం మొత్తం ఆర్థికంగా నష్టపరిచే అంశం. వారి ఆదాయంపై పెద్ద ఎత్తున దెబ్బ పడనుంది. అయితే పూర్తిగా లీగ్ రద్దు కావడంతో పోలిస్తే ఎంతో కొంత ఆదాయం రానుండటం ఊరట కలిగించే అంశం. సాక్షి క్రీడా విభాగం: ఐదేళ్లకు ఏకంగా రూ. 2199 కోట్ల భారీ డీల్... సాలీనా రూ. 440 కోట్ల చెల్లింపులు... ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం వివో 2017లో చేసుకున్న ఒప్పందం ఇది. ఐపీఎల్ రెవిన్యూ షేరింగ్ అగ్రిమెంట్లో ఫ్రాంచైజీలకు టైటిల్ స్పాన్సర్షిప్ అనేది కీలక ఆదాయ వనరు. మొత్తం టైటిల్ స్పాన్సర్‌షిప్‌లో సగభాగం (దాదాపు 1000 కోట్లు) లీగ్‌లోని 8 ఫ్రాంచైజీలకు అందజేస్తారు. అంటే ఏడాదికి రూ. 20 కోట్లకు పైగానే ఫ్రాంచైజీలు ఆర్జిస్తున్నాయి. రాజకీయ కారణాలతో చైనా మూలాలున్న వివో తప్పుకోవడంతో ఆ ప్రభావం ఫ్రాంచైజీలపై పడనుంది. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ‘వివో’ ఇచ్చే మొత్తాన్నే ఇవ్వగల కొత్త స్పాన్సర్ దొరకడం కష్టమే. మరోవైపు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తుండటంతో టిక్కెట్ల విక్రయం ద్వారా లభించే గేట్ రెవెన్యూ కూడా ఫ్రాంచైజీలు కోల్పోనున్నాయి. మీడియా హక్కులే ఆలంబన... ప్రస్తుతం ఫ్రాంచైజీల్ని లీగ్ నిర్వహణ వైపు నడిపిస్తోన్న ఆదాయ వనరు మీడియా హక్కులు. ఈ హక్కుల్ని స్టార్ ఇండియా యాజమాన్యం 2017లో రికార్డు మొత్తానికి సొంతం చేసుకుంది. ఐదేళ్ల కాలానికి రూ. 16,347 కోట్లతో ఈ ఒప్పందం కుదిరింది. క్రికెట్ మీడియా హక్కుల ఒప్పందంలో చరిత్ర సృష్టించిన ఈ భారీ డీల్‌తో ఫ్రాంచైజీలు ఏటా రూ. 150 కోట్లు ఆర్జిస్తున్నాయి. ఈ మీడియా హక్కుల ఫలితంగా ప్రతి సీజన్‌కు రూ. 50 కోట్లు లాభం ఉంటుందని అంచనా. ఇతర ఆదాయ మార్గాల్లోనూ కోత! మీడియా హక్కులతో పాటు కిట్, జెర్సీ, హెల్మెట్లకు వేరు వేరు సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తుంటాయి. వీటి ద్వారా ఫ్రాంచైజీలు సీజన్‌కు రూ. 45–50 కోట్లు ఆర్జిస్తున్నాయి. అయితే గత సీజన్లో ఒక జట్టుకు రూ. 33 కోట్లు ఆదాయాన్ని సమకూర్చిన ఒక ప్రధాన స్పాన్సర్... ఈ సారి అంత మొత్తం ఇవ్వలేమంటూ సంప్రదింపులకు దిగింది. మిగతా జట్లకూ ఇదే అనుభవం ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. కరోనా కారణంగా ఈ సారి ఈ ఆదాయంలో కూడా గండిపడే అవకాశముంది. ఖర్చులు అదనం యూఏఈలో జరిగే టోర్నీ కోసం ఆటగాళ్ల భద్రత దృష్ట్యా చార్టెడ్ ఫ్లయిట్స్‌ను ఫ్రాంచైజీలు వినియోగించనున్నాయి. లీగ్ జరిగినన్ని రోజులు ఆటగాళ్ల వసతి, వారుండే హోటళ్లలో బయో సెక్యూర్ పరిస్థితుల ఏర్పాటు, రవాణా వీటన్నింటికి భారీగా ఖర్చయ్యే అవకాశముంది. వీటి కోసమే దాదాపు రూ. 10–12 కోట్లు ఖర్చయ్యే అవకాశముందని ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి. భారత్‌లో ఖర్చుతో పోలిస్తే ఇది 50–60 శాతం అదనం. మరో వైపు టికెట్లు అమ్మకపోవడం ద్వారా తాము కోల్పోయే ‘గేట్ రెవెన్యూ’కు నష్టపరిహారం చెల్లించాలంటూ ఫ్రాంచైజీలు చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ నిర్ద్వద్వంగా తిరస్కరించింది. అదే విధంగా ఈ ఏడాది మ్యాచ్‌లు జరగకపోయినా దేశంలో ఎనిమిది ఐపీఎల్ జట్లకు కేంద్రాలుగా ఉన్న రాష్ట్ర సంఘాలకు ప్రతీ ఏటా ఒక్కో ఫ్రాంచైజీ చెల్లించే రూ. 8 కోట్లు (మొత్తం రూ. 64 కోట్లు) కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని దిగువ స్థాయి క్రికెట్‌ను ప్రోత్సహిస్తేందుకు ఉపయోగిస్తామని, ఈ డబ్బు లేకపోతే ఆయా సంఘాల్లో క్రికెట్ దెబ్బ తింటుందని బోర్డు అభిప్రాయ పడింది. -
ఆన్లైన్లో ‘పిస్తాహౌస్ హలీమ్’
* ‘స్విగ్గీ’ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసేందుకు అవకాశం * నగరంలోని ఏమూలకైనా డెలివరీ సదుపాయం * ఈ ఏడాది మైసూరు, తుమకూరులో సైతం ఔట్లెట్ల ఏర్పాటు సాక్షి, బెంగళూరు: ఉద్యాననగరి వాసుల మనసుదోచిన హైదరాబాదీ వంటకం ‘పిస్తాహౌస్ హలీమ్’ ఈ రంజాన్ మాసం సందర్భంగా మరోసారి బెంగళూరు నగరంలో అందుబాటులోకి వచ్చేసింది. కాగా, ఈ ఏడాది పిస్తాహౌస్ హలీమ్‌ను ‘స్విగ్గీ’ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని పిస్తాహౌస్ సంస్థ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్రాంచైజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫ్రాంచైజీ ప్రతినిధి షఫీక్ మాట్లాడుతూ... ఏడాదికేడాదికి బెంగళూరులో పిస్తాహౌస్ హలీమ్ అమ్మకాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రముఖ ఫుడ్ ఆన్లైన్ పోర్టల్ ‘స్విగ్గీ’తో ఈ ఏడాది ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.తద్వారా రంజాన్ మాసమంతా బెంగళూరు నగరంలోని ఏ మూలకైనా సరే పిస్తాహౌస్ హలీమ్‌ను డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. వినియోగదారులకు మరింత చేరవకావడంలో భాగంగానే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇక ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఔట్లెట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఔట్లెట్లలో పిస్తాహౌస్ హలీమ్‌తో పాటు హైదరాబాదీ బిర్యానీ, సమోసా, గాజర్ కా హల్వా, కుబానీ కా మీఠా సైతం ఆహార ప్రియుల కోసం అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇక ఈ ఏడాది కేవలం బెంగళూరులోనే కాక మైసూరు, తుమకూరులో సైతం తమ ఔట్లెట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో సైతం తమ ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతపురం, కదిరి, ధర్మవరం, హిందూపురం ప్రాంతాల్లో తమ ఔట్లెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. 330 గ్రాముల హలీమ్ ధర రూ.160, ఒకటిన్నర కిలోల హలీమ్ ధర రూ.650గా నిర్ణయించినట్లు తెలిపారు. -
‘విలువ’ నిలుపుతారా!
ఐపీఎల్-7 కోసం నిర్వహించిన వేలంలో కొంతమంది ఆటగాళ్లకు కళ్లు తిరిగే మొత్తం వచ్చింది. యువరాజ్, పీటర్సన్ లాంటి క్రికెటర్లకు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తం వస్తే... దినేశ్ కార్తీక్, కరణ్ శర్మ లాంటి క్రికెటర్లకు వాళ్లు కూడా నమ్మలేనంత ధర పలికింది. ఫ్రాంచైజీలు భారీ అంచనాలతో వీళ్ల విలువను అనూహ్యంగా పెంచేశాయి. బాగా ఆడినా, ఆడకపోయినా... తుది జట్టులో ఉన్నా లేకున్నా... ఫ్రాంఛైజీలు ఈ క్రికెటర్లకు పూర్తి మొత్తం చెల్లించాలి. మరి వీళ్లు ఈ ‘విలువ’ను నిలబెట్టుకుంటారా? లేక తెల్ల ఏనుగులుగా మారతారా? యువరాజ్ సింగ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విలువ: రూ. 14 కోట్లు గత ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రూ. 14 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించాడు. అయితే ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి యువీపైనే ఉంది. ముఖ్యంగా ఫైనల్లో స్లాగ్ ఓవర్లలో చెత్తగా ఆడి భారత ఓటమికి కారకుడయ్యాడనే విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ తరఫున బరిలోకి దిగుతున్న యువరాజ్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. కోట్ల ధర పలికిన యువరాజ్, విజయ్ మాల్యా జట్టుకు న్యాయం చేస్తాడా లేదా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక టి20 ప్రపంచకప్‌లో విఫలం కావడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఐపీఎల్ ఏడో సీజన్లో అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రాణించడం ద్వారా విమర్శకులకు సమాధానం చెప్పాలని యువీ పట్టుదలగా ఉన్నాడు. దినేశ్ కార్తీక్ ఢిల్లీ డేర్ డెవిల్స్ విలువ: రూ. 12.5 కోట్లు వేలంలో యువరాజ్ తర్వాత అత్యధిక ధర పలికింది వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్కే. ఎవరూ ఊహించని విధంగా కార్తీక్ కోసం ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 12.5 కోట్లు వెచ్చించింది. ఒక రకంగా ఆ వేలం తనని మళ్లీ భారత జట్టుకు దగ్గర చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియాకప్‌లో జట్టులోకి వచ్చాడు. కానీ ఘోరమైన బ్యాటింగ్, పేలవమైన వికెట్ కీపింగ్‌తో దారుణంగా విఫలమయ్యాడు. ఈ పరిస్థితుల్లో దినేశ్ కార్తీక్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఢిల్లీ జట్టు యాజమాన్యం ఇతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది. జట్టుకు బాగా ఉపయోగపడతాడని భావిస్తోంది. మరి కార్తీక్ ఏమేరకు రాణిస్తాడో చూడాలి. కెవిన్ పీటర్సన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ విలువ: రూ. 9 కోట్లు కెవిన్ పీటర్సన్... ఈ ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టగల సమర్థుడు. ఇంగ్లండ్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన కేపీ తొలిసారిగా ఐపీఎల్లో పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉంటున్నాడు. అందుకే విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా పీటర్సన్‌కు వేలంలో రూ. 9 కోట్ల ధర పలికింది. ఇప్పటిదాకా మూడు సీజన్లలో బరిలోకి దిగిన కేపీ... తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాడు. 2012 ఐపీఎల్లో ఈ ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ 8 మ్యాచ్‌లు ఆడి 61 సగటుతో 305 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉంది. అంతకుముందు 2010 సీజన్లోనూ తన సత్తా చాటాడు. తమ తలరాతను పీటర్సన్ మారుస్తాడని ఢిల్లీ ఫ్రాంచైజీ బోలెడు ఆశలు పెట్టుకుంది. కరణ్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ విలువ: రూ. 3.75 కోట్లు భారత దేశవాళీ క్రికెటర్లను ఈ సీజన్లో వేలంలోకి తీసుకురావడంతో రైల్వేస్ స్పిన్నర్ కరణ్ శర్మ పంట పండింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 3.75 కోట్లకు కరణ్‌ను సొంతం చేసుకుంది. ఈసారి వేలంలో దేశవాళీ క్రికెటర్లలో అతనిదే రికార్డు. గత సీజన్లో కరణ్ శర్మ నిలకడగా రాణించడంతో సన్‌రైజర్స్ మరో ఆలోచన లేకుండా తమ ఆటగాడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. అయితే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌లోనూ తను మెరుస్తాడనేది జట్టు విశ్వాసం. గత సీజన్లో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6.6 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. తాజాగా ముస్తాక్ అలీ టి20 టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో 4 వికెట్ల తీశాడు. విదర్భతో మ్యాచ్‌లో 49 పరుగులు చేశాడు. మిషెల్ జాన్సన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విలువ: రూ. 6.5 కోట్లు ఐపీఎల్ వేలంలో పీటర్సన్ తర్వాత అత్యధిక ధరకు అమ్ముడైన విదేశీ క్రికెటర్ మిషెల్ జాన్సన్. గత సీజన్లో ముంైబె ఇండియన్స్ విజయాల్లో కీలకం కావడం, యాషెస్ సిరీస్‌లో అద్భుతంగా రాణించడంతో పంజాబ్ జట్టు జాన్సన్‌పై ఏకంగా రూ.6.5 కోట్లు వెచ్చించింది. గాయం కారణంగా టి20 ప్రపంచకప్‌కు దూరమైన ఈ ఆస్ట్రేలియా స్టార్... ఐపీఎల్లో పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. రిషి ధావన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విలువ: రూ. 3 కోట్లు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన రిషి ధావన్ గత ఏడాది తొలిసారి ఐపీఎల్ ఆడాడు. ముంబై ఇండియన్స్ తరఫున పేసర్‌గా బరిలోకి దిగాడు. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సీజన్ దేశవాళీ క్రికెట్లో బాగా ఆడాడు. 8 రంజీ మ్యాచ్‌ల్లో 49 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్‌లో 435 పరుగులు చేశాడు. దీంతో దేశవాళీ ఆల్‌రౌండర్‌గా ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. దీంతో పంజాబ్ మిగిలిన జట్లతో పోటీ పడి రూ.3 కోట్లు వెచ్చించి రిషిని సొంతం చేసుకుంది. తాజాగా ముస్తాక్ అలీ టి20 టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 48.50 సగటుతో 194 పరుగులు చేసి ఫామ్‌లో ఉన్నానని చాటాడు. అయితే బౌలర్‌గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పంజాబ్ జట్టు దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ తుది జట్టులో అతనికి స్థానం ఇస్తుంది. మరి ఆ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా?