‘విలువ’ నిలుపుతారా!
ఐపీఎల్-7 కోసం నిర్వహించిన వేలంలో కొంతమంది ఆటగాళ్లకు కళ్లు తిరిగే మొత్తం వచ్చింది. యువరాజ్, పీటర్సన్ లాంటి క్రికెటర్లకు ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తం వస్తే... దినేశ్ కార్తీక్, కరణ్ శర్మ లాంటి క్రికెటర్లకు వాళ్లు కూడా నమ్మలేనంత ధర పలికింది. ఫ్రాంచైజీలు భారీ అంచనాలతో వీళ్ల విలువను అనూహ్యంగా పెంచేశాయి. బాగా ఆడినా, ఆడకపోయినా... తుది జట్టులో ఉన్నా లేకున్నా... ఫ్రాంఛైజీలు ఈ క్రికెటర్లకు పూర్తి మొత్తం చెల్లించాలి. మరి వీళ్లు ఈ ‘విలువ’ను నిలబెట్టుకుంటారా? లేక తెల్ల ఏనుగులుగా మారతారా?
యువరాజ్ సింగ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
విలువ: రూ. 14 కోట్లు
గత ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రూ. 14 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించాడు. అయితే ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి యువీపైనే ఉంది. ముఖ్యంగా ఫైనల్లో స్లాగ్ ఓవర్లలో చెత్తగా ఆడి భారత ఓటమికి కారకుడయ్యాడనే విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు.
ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ తరఫున బరిలోకి దిగుతున్న యువరాజ్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. కోట్ల ధర పలికిన యువరాజ్, విజయ్ మాల్యా జట్టుకు న్యాయం చేస్తాడా లేదా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక టి20 ప్రపంచకప్‌లో విఫలం కావడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఐపీఎల్ ఏడో సీజన్‌లో అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రాణించడం ద్వారా విమర్శకులకు సమాధానం చెప్పాలని యువీ పట్టుదలగా ఉన్నాడు.
దినేశ్ కార్తీక్
ఢిల్లీ డేర్ డెవిల్స్
విలువ: రూ. 12.5 కోట్లు
వేలంలో యువరాజ్ తర్వాత అత్యధిక ధర పలికింది వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కే. ఎవరూ ఊహించని విధంగా కార్తీక్ కోసం ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 12.5 కోట్లు వెచ్చించింది. ఒక రకంగా ఆ వేలం తనని మళ్లీ భారత జట్టుకు దగ్గర చేసింది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియాకప్‌లో జట్టులోకి వచ్చాడు.
కానీ ఘోరమైన బ్యాటింగ్, పేలవమైన వికెట్ కీపింగ్‌తో దారుణంగా విఫలమయ్యాడు. ఈ పరిస్థితుల్లో దినేశ్ కార్తీక్‌పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఢిల్లీ జట్టు యాజమాన్యం ఇతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది. జట్టుకు బాగా ఉపయోగపడతాడని భావిస్తోంది. మరి కార్తీక్ ఏమేరకు రాణిస్తాడో చూడాలి.
కెవిన్ పీటర్సన్
ఢిల్లీ డేర్ డెవిల్స్
విలువ: రూ. 9 కోట్లు
కెవిన్ పీటర్సన్... ఈ ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టగల సమర్థుడు. ఇంగ్లండ్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన కేపీ తొలిసారిగా ఐపీఎల్‌లో పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉంటున్నాడు. అందుకే విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా పీటర్సన్‌కు వేలంలో రూ. 9 కోట్ల ధర పలికింది.
ఇప్పటిదాకా మూడు సీజన్లలో బరిలోకి దిగిన కేపీ... తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాడు. 2012 ఐపీఎల్‌లో ఈ ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ 8 మ్యాచ్‌లు ఆడి 61 సగటుతో 305 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉంది. అంతకుముందు 2010 సీజన్‌లోనూ తన సత్తా చాటాడు. తమ తలరాతను పీటర్సన్ మారుస్తాడని ఢిల్లీ ఫ్రాంచైజీ బోలెడు ఆశలు పెట్టుకుంది.
కరణ్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్
విలువ: రూ. 3.75 కోట్లు
భారత దేశవాళీ క్రికెటర్లను ఈ సీజన్‌లో వేలంలోకి తీసుకురావడంతో రైల్వేస్ స్పిన్నర్ కరణ్ శర్మ పంట పండింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 3.75 కోట్లకు కరణ్‌ను సొంతం చేసుకుంది. ఈసారి వేలంలో దేశవాళీ క్రికెటర్లలో అతనిదే రికార్డు. గత సీజన్‌లో కరణ్ శర్మ నిలకడగా రాణించడంతో సన్‌రైజర్స్ మరో ఆలోచన లేకుండా తమ ఆటగాడి కోసం భారీ మొత్తం వెచ్చించింది.
అయితే లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లోనూ తను మెరుస్తాడనేది జట్టు విశ్వాసం. గత సీజన్‌లో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6.6 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. తాజాగా ముస్తాక్ అలీ టి20 టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో 4 వికెట్ల తీశాడు. విదర్భతో మ్యాచ్‌లో 49 పరుగులు చేశాడు.
మిషెల్ జాన్సన్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
విలువ: రూ. 6.5 కోట్లు
ఐపీఎల్ వేలంలో పీటర్సన్ తర్వాత అత్యధిక ధరకు అమ్ముడైన విదేశీ క్రికెటర్ మిషెల్ జాన్సన్. గత సీజన్‌లో ముంైబె ఇండియన్స్ విజయాల్లో కీలకం కావడం, యాషెస్ సిరీస్‌లో అద్భుతంగా రాణించడంతో పంజాబ్ జట్టు జాన్సన్‌పై ఏకంగా రూ.6.5 కోట్లు వెచ్చించింది.
గాయం కారణంగా టి20 ప్రపంచకప్‌కు దూరమైన ఈ ఆస్ట్రేలియా స్టార్... ఐపీఎల్‌లో పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
రిషి ధావన్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
విలువ: రూ. 3 కోట్లు
హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన రిషి ధావన్ గత ఏడాది తొలిసారి ఐపీఎల్ ఆడాడు. ముంబై ఇండియన్స్ తరఫున పేసర్‌గా బరిలోకి దిగాడు. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ సీజన్ దేశవాళీ క్రికెట్‌లో బాగా ఆడాడు. 8 రంజీ మ్యాచ్‌ల్లో 49 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్‌లో 435 పరుగులు చేశాడు. దీంతో దేశవాళీ ఆల్‌రౌండర్‌గా ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.
దీంతో పంజాబ్ మిగిలిన జట్లతో పోటీ పడి రూ.3 కోట్లు వెచ్చించి రిషిని సొంతం చేసుకుంది. తాజాగా ముస్తాక్ అలీ టి20 టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 48.50 సగటుతో 194 పరుగులు చేసి ఫామ్‌లో ఉన్నానని చాటాడు. అయితే బౌలర్‌గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పంజాబ్ జట్టు దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ తుది జట్టులో అతనికి స్థానం ఇస్తుంది. మరి ఆ జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా?