ముంబై: ఐపీఎల్ భారత్‌లో జరగకపోవడంతో ఈ ఏడాది తాము నష్టపోతున్న మొత్తాన్ని బీసీసీఐ సర్దుబాటు చేయాలంటూ ఫ్రాంచైజీలు చేస్తున్న డిమాండ్‌పై బోర్డు అసహనం వ్యక్తం చేసింది. కరోనా ప్రభావం గురించి అందరికీ తెలుసని, ఇటువంటి స్థితిలో ఇలాంటి డిమాండ్లు అర్థరహితమని బోర్డు వర్గాలు చెప్పాయి. ఒక ఫ్రాంచైజీ తమ నష్టాన్ని రూ. 46 కోట్లుగా చూపిస్తూ బోర్డుకు లేఖ రాసింది. ‘అసలు ఈ ఏడాది ఐపీఎల్ జరగడమే గొప్ప. అదీ లేకపోతే వారంతా ఏం చేసేవారు. అర్థం లేని డిమాండ్లు చేస్తారా. అయితే ఈసారి కూడా ఒక్కో ఫ్రాంచైజీకి కనీసం రూ. 150 కోట్లు వస్తాయి. ఇదంతా మాకు తెలీదా. ఇలా చిల్లర లెక్కలు చేస్తారా’ అని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు తమ అర్థరహిత సందేహాలు తీర్చమంటూ కూడా వారు కోరుతున్నారని ఆయన చెప్పారు. ‘తమ వెంట ఎంత మంది కుటుంబ సభ్యులను, మిత్రులను తీసుకు రావచ్చని ఫ్రాంచైజీలు అడుగుతున్నాయి. కరోనా ఆటగాడి బంధువా, చుట్టమా అని అడిగి రాదు కదా. అవన్నీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment