జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా రెండు దేశాల తరపున ప్రాతినిధ్యం వహించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో గ్యారీ బ్యాలెన్స్ ఒకడు. గ్యారీ బ్యాలెన్స్ మొదట ఇంగ్లండ్ జట్టుకు ఆడాడు. 2014 నుంచి 2017 వరకు ఇంగ్లండ్ తరపున 23 టెస్టులాడిన బ్యాలెన్స్.. ఆ తర్వాత జాతి వివక్షకు గురయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) అతన్ని సస్పెండ్ చేసింది.
దీంతో బ్యాలెన్స్ ఇంగ్లండ్ క్రికెట్‌ను వదిలి తాను పుట్టిన జింబాబ్వేకు వచ్చేశాడు. 2022లో జింబాబ్వే తరపున తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఓవరాల్‌గా గ్యారీ బ్యాలెన్స్ తన కెరీర్‌లో 24 టెస్టులాడి 1653 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు, ఏడు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక 21 వన్డేల్లో 454 పరుగులు చేసిన బ్యాలెన్స్ ఖాతాలో మూడు వన్డే అర్థసెంచరీలు ఉన్నాయి.
టెస్టు క్రికెట్‌లో పెను సంచలనం.. ఘనమైన ఆరంభం
గ్యారీ బ్యాలెన్స్ అంతర్జాతీయ అరంగేట్రం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఇంగ్లండ్ తరపున 2014లో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి 10 టెస్టులు కలిపి 67.93 సగటుతో 1017 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ఒక రకంగా ఇది రికార్డు అని చెప్పొచ్చు.
దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత తొలి పది టెస్టుల్లో 60కి పైగా సగటుతో వెయ్యి పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా గ్యారీ బ్యాలెన్స్ చరిత్రకెక్కాడు. నిజంగా ఏ క్రికెటర్‌కు అయినా ఇది మంచి ఆరంభం అని చెప్పొచ్చు. కానీ బ్యాలెన్స్ ఇదే ప్రదర్శనను తర్వాత కంటిన్యూ చేయలేకపోయాడు. తర్వాతి 13 టెస్టుల్లో రెండు అర్థసెంచరీలు మాత్రమే నమోదు చేసిన బ్యాలెన్స్ 19.04 సగటుతో కేవలం 481 పరుగులు మాత్రమే చేశాడు.
ఇంగ్లండ్ క్రికెట్ నుంచి సస్పెండ్.. జింబాబ్వే తరపున అరంగేట్రం
కెరీర్‌లో పీక్ దశలో ఉన్న సమయంలోనే గ్యారీ బ్యాలెన్స్ జాతి వివక్షపై చేసిన వ్యాఖ్యలు అతన్ని సస్పెండ్ అయ్యేలా చేశాయి. కౌంటీల్లో యార్క్‌షైర్ తరపున ఆడుతున్న బ్యాలెన్స్ .. తోటి క్రికెటర్ అజామ్ రఫీక్ ఎదుర్కొన్న వివక్షను మీడియా ముందు బయటపెట్టాడు.
యార్క్‌షైర్‌లో జాతి వివక్ష మాట నిజమేనని.. ఇదంతా చూస్తూ కూడా ఈసీబీ ఏం పట్టనట్లుగా ఉందని.. పైగా తాను కూడా ఒక సందర్భంలో జాతి వివక్షకు గురయ్యానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈసీబీ బ్యాలెన్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ తర్వాత గ్యారీ బ్యాలెన్స్ తాను పుట్టిన జింబాబ్వేకు వెళ్లిపోయాడు. జింబాబ్వే క్రికెట్‌తో రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్న గ్యారీ బ్యాలెన్స్ 2022 డిసెంబర్‌లో తిరిగి జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే నాలుగు నెలల్లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు.
Comments
Please login to add a commentAdd a comment