చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 23న(ఆదివారం) ఆసక్తికర పోరు జరగనుంది. ఇప్పటికే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోగా.. టీవీల్లో వీక్షించేందుకు అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బుమ్రా దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ కాస్త వీక్‌గా కనిపిస్తుండగా.. అటు షాహిన్ అఫ్రిది రీఎంట్రీతో పాకిస్తాన్ జట్టు బౌలింగ్‌లో బలంగా కనిపిస్తోంది. అయితే టీమిండియా బ్యాటింగ్‌లో దుర్బేద్యంగా ఉండడంతో మరోసారి టీమిండియా బ్యాటర్లు, పాక్ బౌలర్ల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
అయితే ఐసీసీ మేజర్ టోర్నీలైన వన్డే, టి20 ప్రపంచకప్‌లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది కేవలం ఒక్కసారి మాత్రమే. అది కూడా గతేడాది టి20 ప్రపంచకప్‌లోనే. షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో చెలరేగి మూడు వికెట్లతో టాపార్డర్‌ను కకావికలం చేయడంతో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆ తర్వాత చేజింగ్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోని పాక్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌ను టీమిండియా అభిమానులు అంత త్వరగా మరిచిపోలేరు. ఏడాది తిరక్కుండానే మరోసారి టీమిండియా, పాకిస్తాన్‌లు టి20 ప్రపంచకప్‌లో తలపడనుండడంతో ఈసారి భారత్ రివేంజ్ తీసుకుంటుందని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఈసారి కూడా అందరి కళ్లు షాహిన్ అఫ్రిదిపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. " భయపడితే పనులు కావు.అఫ్రిది బౌలింగ్ చేసే సమయంలో వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నించొద్దు. అతని బౌలింగ్‌లో రన్స్ చేయండి.ఎందుకంటే వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పుడే సమస్య మొదలవుతోంది.
అది మీ ఫుట్‌వర్క్ కావచ్చు మరొకటి కావచ్చు. అయినా టీ20 క్రికెట్‌లో వికెట్ కాపాడుకుపోవడానికి ప్రయత్నించొద్దు. అతడు కొత్త బంతితో ప్రమాదకర బౌలర్ అని తెలుసు. అయినా సరే అతని బౌలింగ్‌లో రన్స్ చేయడానికి ప్రయత్నించాలి. బంతిని బలంగా బాదడం కంటే సరైన పొజిషన్‌లో నిల్చొని టైమింగ్ సరిగా ఉండాలి. నిజానికి అఫ్రిదిని టార్గెట్ చేసేలా ఇండియన్ టీమ్‌లో టాప్ 3 లేదా 4 బ్యాటర్లు ఉన్నారు" అని పేర్కొన్నాడు.
చదవండి: 14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు.. డ్యాన్స్‌తో లంక క్రికెటర్స్ అదుర్స్
Comments
Please login to add a commentAdd a comment