ఆర్సీబీ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఐపీఎల్ 2024 సీజన్ నుంచి నిరవధిక విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. శారీరక, మానసిక అలసట కారణంగా క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు మ్యాక్సీ ప్రకటించాడు. విరామం ఎన్ని రోజుల అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మ్యాక్స్‌వెల్ ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు.
పేలవమైన ఫామ్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన మాక్స్‌వెల్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. తనను సన్‌రైజర్స్ మ్యాచ్ నుంచి తప్పించమని మ్యాక్స్‌వెల్ స్వయంగా ఆర్సీబీ యాజమాన్యాన్ని కోరాడు. తన స్థానంలో మరో ఆటగాడిని తీసుకోమని మ్యాక్సీ కెప్టెన్ డుప్లెసిస్‌కు విజ్ఞప్తి చేశాడు. అందుకే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ స్థానంలో విల్ జాక్స్ తుది జట్టులోకి వచ్చాడు.
కాగా, మ్యాక్సీ ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 32 పరుగులు (0, 3, 28, 0, 1, 0) మాత్రమే చేసిన విషయం తెలిసిందే. ఇందులో మూడు డకౌట్లు ఉన్నాయి. మ్యాక్సీ సహా ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ మొత్తం (విరాట్ మినహా) దారుణంగా విఫలం కావడంతో ఈ సీజన్‌లో ఆర్సీబీ 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
గత సీజన్లలో మ్యాక్స్‌వెల్ ఆర్సీబీ తరఫున చేసిన స్కోర్లు..
- 2021 సీజన్- 513 పరుగులు
- 2022 సీజన్- 301 పరుగులు
- 2023 సీజన్- 400 పరుగులు
సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. పోరాడితే పోయేదేమీ లేదన్న చందంగా ఆర్సీబీ పోరాటం చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.
ఛేదనలో ఆర్సీబీ చివరి వరకు గెలుపు కోసం పోరాడింది. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment