Photo Courtesy: IPL 2026
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ సాయి సుదర్శన్‌ది ప్రత్యేకమైన స్థానం. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఒకే జట్టుకు ఆడుతూ స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్న అరుదైన క్రికెటర్లలో సాయి సుదర్శన్ కూడా ఒకడు. ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ తన బ్యాటింగ్‌తో అలరిస్తున్న సాయి సుదర్శన్ మంగళవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లోనూ 61 పరుగులతో మెరిశాడు.
తద్వారా ఐపీఎల్‌లో ఒక అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అర్థశతకం సాధించడం ద్వారా ఐపీఎల్‌లో తాను ఎదుర్కొన్న అన్ని జట్లపై కనీసం ఒక ఫిఫ్టీ సాధించిన నాలుగో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు.
గతంలో గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్‌తో పాటు ఎస్ఆర్‌హెచ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ ఫీట్‌ను సాధించారు. తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ సీఎస్‌కేపై నాలుగు అర్థశతకాలు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్, రాజస్తాన్‌లపై మూడు ఫిఫ్టీలు, కేకేఆర్, ముంబై, ఆర్సీబీలపై రెండు హాఫ్ సెంచరీలు, లక్నో, ఎస్ఆర్‌హెచ్‌లపై ఒక్కో అర్థశతకం సాధించాడు.
ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి కొనసాగుతున్న భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ ఫీట్‌ను అందుకోవడంలో విఫలమయ్యారు. ఈ సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్న సాయి సుదర్శన్ 500 పరుగుల మార్క్‌ను దాటాడు. తద్వారా వరుసగా మూడో సీజన్‌లోనూ ఐదొందల పరుగుల మార్క్‌ను దాటిగా ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచాడు.
ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం సాయి సుదర్శన్ 12 మ్యాచ్‌ల్లో 501 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీలతో రాణించారు.
అనంతరం ఎస్ఆర్‌హెచ్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కమిన్స్ (19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ చెరో 3 వికెట్లతో చెలరేగగా.. ప్రిసిధ్ క్రిష్ణ 2, సిరాస్ ఒక వికెట్ పడగొట్టాడు. వరుసగా ఐదో విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకోగా, ఎస్ఆర్‌హెచ్ మూడో స్థానానికి పడిపోయింది.


