
తొలి విజయం సాధించిన టైటాన్స్
36 పరుగులతో ఓడిన ముంబై
రాణించిన సుదర్శన్, ప్రసిధ్
మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ తాజా సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన టీమ్ సొంతగడ్డపై పాయింట్ల ఖాతా తెరిచింది. బ్యాటింగ్‌లో సాయిసుదర్శన్, బౌలింగ్‌లో ప్రసిధ్, సిరాజ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరో వైపు గత మ్యాచ్‌లాగే అన్ని రంగాల్లో విఫలమైన ముంబై వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో ఆ జట్టు కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది.
అహ్మదాబాద్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన గుజరాత్ టైటాన్స్ గెలుపు బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా...జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; 1 ఫోర్, 4 సిక్స్‌లు), తిలక్‌వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ (2/18), సిరాజ్ (2/34) ప్రత్యర్థిని దెబ్బ తీశారు.
కీలక భాగస్వామ్యాలు...
గుజరాత్ ఇన్నింగ్స్‌లో టాప్–3 నెలకొల్పిన రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు జట్టు స్కోరులో కీలకంగా నిలిచాయి. తొలి వికెట్‌తో గిల్‌తో 78 పరుగులు (51 బంతుల్లో) జోడించిన సుదర్శన్, రెండో వికెట్‌కు బట్లర్‌తో 51 పరుగులు (32 బంతుల్లో) జత చేశాడు. సుదర్శన్, గిల్ ధాటిగా ఆడుతూ 7 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 66 పరుగులకు చేరింది.
గిల్ వెనుదిరిగిన తర్వాత వచ్చిన బట్లర్ కూడా కొద్ది సేపు ధాటిని ప్రదర్శించాడు. 33 బంతుల్లో వరుసగా రెండో మ్యాచ్‌లో సుదర్శన్ అర్ధ సెంచరీ పూర్తయింది. షారుఖ్ ఖాన్ (9)ను ముందుగా పంపిన ప్రయత్నం ఫలితం ఇవ్వకపోగా, రూథర్‌ఫోర్డ్ (18) రాజు ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. 18వ ఓవర్ చివరి బంతికి సుదర్శన్‌ను బౌల్ట్ అవుట్ చేయడంతో గుజరాత్ జోరుక బ్రేక్ పడింది.
చివరి 2 ఓవర్లలో ఆ జట్టు 17 పరుగులు మాత్రమే సాధించి 4 వికెట్లు చేజార్చుకుంది. దాంతో స్కోరు 200 పరుగులు దాటలేకపోయింది. ముంబై తరఫున రెండో మ్యాచ్ ఆడిన ఆంధ్ర పేస్ బౌలర్ పెన్మత్స సత్యనారాయణ రాజు ఐపీఎల్‌లో తన తొలి వికెట్ సాధించడం విశేషం.
రాణించిన తిలక్...
ఛేదనలో ముంబై పూర్తిగా తడబడింది. తిలక్‌వర్మ, సూర్యకుమార్ క్రీజ్‌లో ఉన్న సమయంలోనే జట్టు గెలుపుపై ఆశలు ఉండగా...ఇది మినహా మిగతా ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ (8) తర్వాతి బంతికి వెనుదిరగ్గా, రికెల్టన్ (6)ను కూడా సిరాజ్ బౌల్డ్ చేశాడు. తిలక్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు.
రబాడ ఓవర్లో అతను వరుసగా 4, 4, 6 కొట్టాడు. మరో ఎండ్‌లో సూర్య కూడా తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. మూడో వికెట్‌కు 42 బంతుల్లో 62 పరుగులు జత చేసిన తర్వాత తిలక్‌ను ప్రసిధ్ వెనక్కి పంపాడు. 51 బంతుల్లో 100 పరుగులు చేయాల్సిన ఈ స్థితినుంచి ముంబై కోలుకోలేకపోయింది. 27 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు కోల్పోయిన జట్టు ఓటమిని ఆహ్వానించింది.

స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 63; శుబ్‌మన్ గిల్ (సి) నమన్ (బి) పాండ్యా 38; బట్లర్ (సి) రికెల్టన్ (బి) ముజీబ్ 39; షారుఖ్ (సి) తిలక్ (బి) పాండ్యా 9; రూథర్‌ఫోర్డ్ (సి) సాంట్నర్ (బి) చహర్ 18; తెవాటియా (రనౌట్) 0; రషీద్ (సి) పాండ్యా (బి) రాజు 6; రబాడ (నాటౌట్) 7; సాయికిషోర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–78, 2–129, 3–146, 4–179, 5–179, 6–179, 7–194, 8–196. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–34–1, దీపక్ చహర్ 4–0–39–1, ముజీబ్ 2–0–28–1, హార్దిక్ పాండ్యా 4–0–29–2, సాంట్నర్ 3–0–25–0, సత్యనారాయణ రాజు 3–0–40–1.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) సిరాజ్ 8; రికెల్టన్ (బి) సిరాజ్ 6; తిలక్‌వర్మ (సి) తెవాటియా (బి) ప్రసిధ్ 39; సూర్యకుమార్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 48; మిన్జ్ (సి) ఇషాంత్ (బి) సాయికిషోర్ 3; పాండ్యా (సి) సిరాజ్ (బి) రబాడ 11; నమన్ (నాటౌట్) 18; సాంట్నర్ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–8, 2–35, 3–97, 4–108, 5–120, 6–124. బౌలింగ్: సిరాజ్ 4–0–34–2, రబాడ 4–0–42–1, ఇషాంత్ 2–0–17–0, రషీద్ 2–0–10–0, సాయికిషోర్ 4–0–37–1, ప్రసిధ్ 4–0–18–2.
ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ X హైదరాబాద్
వేదిక: విశాఖపట్నం
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి
రాజస్తాన్ X చెన్నై
వేదిక: గువాహటి
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం