Delhi Capitals vs Gujarat Titans Scorecard: గుజరాత్ టైటాన్స్... దాదాపు తొలి మ్యాచ్ తరహాలోనే... ఎలాంటి హంగామా, వ్యక్తిగతంగా మెరుపు ప్రదర్శనలు లేవు... విధ్వంసక ఆట లేదు... అంతా సమష్టి తత్వం, అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు తలా ఓ చేయి వేశారు... ముందుగా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి కట్టడి, ఆపై ప్రశాంతంగా లక్ష్య ఛేదన...డిఫెండింగ్ చాంపియన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సత్తా చాటింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానంలో ఆడుతున్న ప్రయోజనాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేక చతికిలపడింది. ఫలితమే వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.
న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయంతో తమ స్థాయిని ప్రదర్శించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (32 బంతుల్లో 37; 7 ఫోర్లు), అక్షర్ పటేల్ (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సర్ఫరాజ్ ఖాన్ (34 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
రషీద్ ఖాన్, షమీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (48 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, మిల్లర్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 29 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు.
సమష్టి వైఫల్యం...
తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి కూడా ఢిల్లీ బ్యాటింగ్ ఏమాత్రం మెరుగుపడలేదు. పృథ్వీ షా, మిచెల్ మార్ష్ మళ్లీ విఫలం కాగా, వార్నర్ మరోసారి తన శైలికి భిన్నంగా దాదాపు అదే తరహాలో 115 స్ట్రయిక్‌రేట్‌తో ఆడాడు. టైటాన్స్ బౌలర్లు ఆరంభం నుంచి ప్రత్యర్థిని కట్టి పడేశారు. తన వరుస రెండు ఓవర్లలో పృథ్వీ షా (7), మార్ష్ (4)లను షమీ వెనక్కి పంపగా, వార్నర్ చేసిన పరుగులతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 52/2కు చేరింది.
అనంతరం వరుస బంతుల్లో వార్నర్, రోసో (0)లను అవుట్ చేసి జోసెఫ్ ఢిల్లీని దెబ్బ కొట్టాడు. మరో ఎండ్‌లో సర్ఫరాజ్ నిలబడినా, అతనూ వేగంగా ఆడలేకపోయాడు. 13 పరుగుల వద్ద జోష్ లిటిల్ క్యాచ్ వదిలేసి మరో అవకాశం దక్కినా అతను దానిని ఉపయోగించుకోలేదు. అభిషేక్ పోరెల్ (11 బంతుల్లో 20; 2 సిక్స్‌లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా అది ఎక్కువసేపు సాగలేదు. అయితే 101/5 వద్ద క్రీజ్‌లోకి వచ్చిన అక్షర్ కీలక పరుగులు సాధించాడు. చివర్లో అతను కొట్టిన మూడు సిక్సర్లతోనే ఢిల్లీ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది.
కీలక భాగస్వామ్యం...
ఖలీల్ వేసిన తొలి ఓవర్లోనే 2 ఫోర్లు, సిక్స్ కొట్టి వృద్ధిమాన్ సాహా (14) జోరుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టగా, ముకేశ్ వేసిన తర్వాతి ఓవర్లో శుబ్‌మన్ గిల్ (14) రెండు ఫోర్లు కొట్టాడు. అయితే అద్భుత బంతులతో నోర్జే వీరిద్దరిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. హార్దిక్ పాండ్యా (5) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి దశలో సుదర్శన్, విజయ్ శంకర్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు) కీలక భాగస్వామ్యంతో టైటాన్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
ఎలాంటి సాహసాలకు పోకుండా వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ లక్ష్యం దిశగా నడిపించారు. ఈ క్రమంలో కొన్ని చక్కటి షాట్లతో సుదర్శన్ ఆకట్టుకున్నాడు. నాలుగో వికెట్‌కు 44 బంతుల్లో 53 పరుగులు జోడించిన అనంతరం శంకర్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అయితే వచ్చీ రాగానే మిల్లర్ తన దూకుడును ప్రదర్శించాడు. ముకేశ్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ బాది టైటాన్స్ పని సులువు చేశాడు. 44 బంతుల్లో సుదర్శన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మరో 11 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ విజయాన్నందుకుంది.
విలియమ్సన్ స్థానంలో షనక
మోకాలి గాయంతో ఐపీఎల్‌కు దూరమైన స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ స్థానంలో శ్రీలంక జట్టు కెప్టెన్ దాసున్ షనకను గుజరాత్ టైటాన్స్ జట్టు తీసుకుంది. గత ఐపీఎల్ వేలంలో షనకను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇప్పుడు విలియమ్సన్ స్థానంలో షనకతో అతని కనీస ధర రూ. 50 లక్షలకు గుజరాత్ టైటాన్స్ ఒప్పందం చేసుకుంది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) జోసెఫ్ 37; పృథ్వీ షా (సి) జోసెఫ్ (బి) షమీ 7; మార్ష్ (బి) షమీ 4; సర్ఫరాజ్ (సి) లిటిల్ (బి) రషీద్ 30; రోసో (సి) తెవాటియా (బి) జోసెఫ్ 0; పోరెల్ (బి) రషీద్ 20; అక్షర్ (సి) మిల్లర్ (బి) షమీ 36; అమన్ ఖాన్ (సి) పాండ్యా (బి) రషీద్ 8; కుల్దీప్ (నాటౌట్) 1; నోర్జే (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–29, 2–37, 3–67, 4–67, 5–101, 6–130, 7–148, 8–158. బౌలింగ్: షమీ 4–0–41 –3, లిటిల్ 4–0–27–0, పాండ్యా 3–0–18–0, జోసెఫ్ 4–0–29–2, యష్ దయాల్ 1–0–12–0, రషీద్ ఖాన్ 4–0–31–3.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (బి) నోర్జే 14; గిల్ (బి) నోర్జే 14; సుదర్శన్ (నాటౌట్) 62; పాండ్యా (సి) పోరెల్ (బి) ఖలీల్ 5; విజయ్ శంకర్ (ఎల్బీ) (బి) మార్ష్ 29; మిల్లర్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–22, 2–36, 3–54, 4–107. బౌలింగ్: ఖలీల్ 4–0–38–1, ముకేశ్ 4–0–42–0, నోర్జే 4–0–39–2, మార్ష్ 3.1–0–24–1, కుల్దీప్ 3–0–18–0.
ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్ vs పంజాబ్ (రాత్రి గం. 7:30 నుంచి )
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment