సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో టీమిండియాతో పాటు జట్టు మేనేజేమెంట్‌పై కూడా విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై మాజీలు, అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
రోహిత్‌ను వెంటనే కెప్టెన్సీ తప్పించాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో జట్టుతో పాటు, కోచింగ్ స్టాఫ్‌లో కూడా మార్పులు చేసే సమయం ఆసన్నమైంది భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
ఇండియా టుడేతో హర్భజన్ మాట్లాడుతూ.. "రాహుల్ ద్రవిడ్ చాలా తెలివైనవాడు. మేమిద్దరం కలిసి చాలా కాలం క్రికెట్ ఆడాము. కానీ పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు ఇటీవలే టీ20 క్రికెట్ నుంచి రిటైరైన వ్యక్తి కోచ్‌గా కావాలి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌ను అర్ధం చేసుకోనే వ్యక్తిని తీసుకురావాలి. ద్రవిడ్‌ను భారత జట్టు కోచ్‌గా తొలగించకూడదనుకుంటే.. ఇటీవల రిటైర్ అయిన వారిని అతడికి అసిస్టెంట్‌గా అయినా ఎంపికచేయండి.
ఆశిష్ నెహ్రా లాంటి మాజీ ఆటగాడిని కోచింగ్ స్టాఫ్‌లో భాగం చేయండి. నెహ్రాది గొప్ప క్రికెట్ మైండ్. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ విషయంలో అతడు ఏం చేశాడో మనం చూశాం. అతడు జట్టుతో కలిస్తే యువ ఆటగాళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు" అని పేర్కొన్నాడు.
ఇక టీ20 కెప్టెన్సీ గురించి భజ్జీ మాట్లాడుతూ.. "నా అభిప్రాయం ప్రాకారం అయితే హార్దిక్ పాండ్యాను భారత జట్టు కెప్టెన్ చేస్తే బాగుటుంది. అతడు ప్రస్తుత జట్టులో అత్యుత్తమ ఆటగాడు. అతడి లాంటి ఆటగాళ్లు భారత జట్టుకు మరింత మంది అవసరం" అని తెలిపాడు.
చదవండి: Wasim Akram: "ఐపీఎల్ ప్రారంభమైంది.. భారత్ పని అయిపోయింది"
Comments
Please login to add a commentAdd a comment