టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మద్దతుగా నిలిచాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న హార్దిక్ ప్రపంచకప్-2024లో కీలక పాత్ర పోషించగలడని జోస్యం చెప్పాడు.
ఐసీసీ ఈవెంట్లలో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే ఎక్కువ ప్రభావం చూపగలడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన పాండ్యా ఇటు కెప్టెన్‌గా.. అటు ఆల్‌రౌండర్‌గా విఫలమవుతున్నాడు.
అతడి సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఆడిన పది మ్యాచ్‌లలో మూడు మాత్రమే గెలిచింది. ఇక పేస్ ఆల్‌రౌండర్ పాండ్యా 197 పరుగులు స్కోరు చేయడంతో పాటు.. కేవలం ఆరు వికెట్లు పడగొట్టాడు. అది కూడా ధారాళంగా పరుగులు(ఎకానమీ 11) ఇచ్చి ఈ మాత్రం వికెట్లు తీశాడు.
ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను టీ20 ప్రపంచకప్-2024 జట్టుకు ఎంపిక చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన మహ్మద్ కైఫ్.. పాండ్యాకు అండగా నిలిచాడు.
‘‘ఐసీసీ ఈవెంట్లలో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే ఎక్కువ ఇంపాక్ట్ చూపగలడని నేను భావిస్తున్నా. పాకిస్తాన్‌తో టీమిండియా మ్యాచ్‌ల సందర్భంగా ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది.
మెల్‌బోర్న్‌లో కోహ్లి 82 పరుగులు చేసినపుడు.. హార్దిక్ పాండ్యా 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు మూడు వికెట్లు కూడా తీశాడు.
ఆసియా కప్ టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఫినిషింగ్ టచ్‌తో ఆకట్టుకున్నాడు. నవాజ్ బౌలింగ్‌లో ఆఖరి ఓవర్లో దుమ్ములేపాడు. దినేశ్ కార్తిక్, జడేజా అవుటైన తర్వాత పట్టుదలగా నిలబడి జట్టును గట్టెక్కించాడు’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో గుర్తుచేశాడు.
మేజర్ ఈవెంట్లలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుతో ఉండటం ఎంత అవసరమో ఈ ఉదాహరణల ద్వారా వివరించాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా వరల్డ్‌కప్ ఆరంభం కానుండగా.. టీమిండియా జూన్ 5న తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతంది. తదుపరి జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment