'వార్నర్‌ కంటే అవమానాలు.. హార్దిక్‌ పరిస్థితి అలా కాదుగా' | Hardik Pandya Would Do-Well Vs MI But Dont Compare With David Warner | Sakshi
Sakshi News home page

Hardik Pandya: 'వార్నర్‌ కంటే అవమానాలు.. హార్దిక్‌ పరిస్థితి అలా కాదుగా'

Published Fri, May 6 2022 7:36 PM | Last Updated on Fri, May 6 2022 8:36 PM

Hardik Pandya Would  Do-Well Vs MI But Dont Compare With David Warner - Sakshi

ఐపీఎల్‌ 2022లో శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్‌ అవకాశాలు కోల్పోగా.. గుజరాత్‌ టైటాన్స్‌ మాత్రం​టాప్‌ స్థానంలో ఉంటూ దాదాపు ప్లే ఆఫ్‌ బర్త్‌ ఖరారు చేసుకుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ కంటే ఒక వ్యక్తి ఆసక్తికరంగా మారాడు. అతనే హార్దిక్‌ పాండ్యా. ప్రస్తుతం పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా టాప్‌గేర్‌లో ఉన్నాడు. ఒకవైపు కెప్టెన్‌గా రాణిస్తూనే.. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఇరగదీస్తున్నాడు. ఓవరాల్‌గా గుజరాత్‌ టైటాన్స్‌కు టైటిల్‌ అందించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నాడు. 

హార్దిక్‌ పాండ్యాకు ముంబై ఇండియన్స్‌తో విడదీయలేని అనుబంధం ఉంది. ముంబై ఐదుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిస్తే.. అందులో నాలుగుసార్లు హార్దిక్‌ పాండ్యా భాగస్వామిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో 2015లో ముంబై ఇండియన్స్‌ తరపున 85 మ్యాచ్‌లాడిన హార్దిక్‌ 1476 పరుగులతో పాటు 42 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత క్రమంగా ఫామ్‌ కోల్పోయిన హార్దిక్‌ టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. మెగావేలానికి ముందు హార్దిక్‌ను ముంబై రిలీజ్‌ చేసింది. రిటైన్‌ జాబితాలో రోహిత్‌, పొలార్డ్‌, బుమ్రాలను మాత్రమే అట్టిపెట్టుకుంది. ఆ తర్వాత.. హార్దిక్‌ గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 15 కోట్లకు రిటైన్‌ చేసుకొని కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

ఇక విషయంలోకి వెళితే.. గురువారం ఎస్‌ఆర్‌హెచ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ చెలరేగాడు. 58 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. ఒక రకంగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీపై తన రివేంజ్‌ను తీసుకున్నాడంటూ పేర్కొన్నారు. అయితే ముంబైతో మ్యాచ్‌కు ముందు హార్దిక్‌ను కూడా అభిమానులు అదే విధంగా చూస్తున్నారు. తన పాత టీమ్‌ ముంబై పై హార్దిక్‌ చెలరేగుతాడని ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు.

అయితే టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ హార్దిక్‌ పాండ్యా విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాడు. ''హార్దిక్‌ పాండ్యా ఇవాళ ముంబై ఇండియన్స్‌పై మంచి ఇన్నింగ్స్‌ ఆడుతాడని ఆశించడం సహజం. ఒక కెప్టెన్‌గా పాండ్యా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. అయితే వార్నర్‌తో పాండ్యాను పోల్చకూడదు. గత సీజన్‌లో వార్నర్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి అవమానాలు ఎదురయ్యాయి. కెప్టెన్‌ నుంచి తొలగించడం.. జట్టులో చోటు కల్పించకపోవడం.. ఆపై డ్రింక్స్‌బాయ్‌గా సేవలందించడం చాలా మంది తట్టుకోలేకపోయారు. అయితే వార్నర్‌ ఇలాంటివి పట్టించుకోలేదు.

యాదృశ్చికంగా ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో వార్నర్‌ దుమ్మురేపాడు. దీంతో వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌పై ప్రతీకారం తీర్చుకున్నట్లయిందన్నారు. వార్నర్‌ విషయంలో ఇది నిజం కావొచ్చు. కానీ హార్దిక్‌ పరిస్థితి వేరు. ముంబై ఇండియన్స్‌లో కొనసాగినంత కాలం అతనికి మంచి సపోర్ట్‌ లభించింది. ఎలాంటి అవమానాలు ఎదురుకాలేదు. మెగావేలానికి ముందు ముంబై అతన్ని రిటైన్‌ చేసుకోకపోవడం ద్వారా దూరమయ్యాడు తప్పిస్తే జట్టు నుంచి అవమానకరంగా వెళ్లిపోలేదు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ చెలరేగి ఆడొచ్చు.. అంతమాత్రానా వార్నర్‌తో పాండ్యాను పోల్చద్దు'' అని చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement