278 బంతుల్లో 37 నాటౌట్‌.. బౌలర్లకు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా లెజెండ్‌ | Hashim Amla Scores 37 Off 278 Balls In County Championship | Sakshi
Sakshi News home page

278 బంతుల్లో 37 నాటౌట్‌.. బౌలర్లకు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా లెజెండ్‌

Published Thu, Jul 8 2021 7:14 PM | Last Updated on Thu, Jul 8 2021 7:14 PM

Hashim Amla Scores 37 Off 278 Balls In County Championship - Sakshi

లండన్: టీమిండియా మాజీ కెప్టెన్, ద వాల్‌ రాహుల్ ద్రవిడ్ డిఫెన్స్‌కు పెట్టింది పేరు. అతని తర్వాత ఆ స్థానాన్ని టీమిండియా నయా వాల్‌ చతేశ్వర్ పుజారా ఆక్రమించాడు. అయితే వీరిద్దరి డిఫెన్స్‌ను తలదన్నేలా, ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్‌ హాషీమ్‌ ఆమ్లా. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక కౌంటీ క్రికెట్లో సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  సౌథాంప్టన్‌ వేదికగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 278 బంతులను ఎదుర్కొన ఆమ్లా.. 37 పరుగులతో అజేయంగా నిలిచి డిఫెన్స్‌ అంటే ఎలా ఉంటుందో ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. ఈ క్రమంలో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ను గుర్తుకు తెచ్చాడు. ఆమ్లా డిఫెన్సివ్‌ ఇన్నింగ్స్‌తో సర్రే జట్టు ఓటమి నుంచి బయటపడింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హాంప్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగులు చేసింది. కివీస్ ఆల్‌రౌండర్‌ కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ 213 బంతుల్లో 174 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో సర్రే కేవలం 72 పరుగులకే ఆలౌటైంది. ఇందులో హషీమ్‌ ఆమ్లా చేసిన 29 పరుగులే అత్యధికం. దీంతో ఫాలో ఆన్‌ ఆడిన సర్రే..  రెండో ఇన్నింగ్స్‌లోనూ కష్టాల్లో పడింది. ఆఖరి రోజు 6/2తో ఆట ఆరంభించిన ఆ జట్టు మరో 3 పరుగులకే మూడో వికెట్‌ కోల్పోయింది. నాలుగో స్థానంలో దిగిన ఆమ్లా తన క్లాస్ ఆటతీరుతో జట్టును ఆదుకున్నాడు. ఆఖరి రోజంతా క్రీజులో నిలబడ్డ ఆయన.. బౌన్సర్లు, యార్కర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ క్రికెట్‌లోని క్లాస్‌ను ప్రత్యర్ధులకు రుచి చూపించాడు.

తొలి 100 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన ఆమ్లా.. హాంప్‌షైర్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఎంత కఠినంగా బంతులేసినా.. ఊరించినా అస్సలు వికెట్ చేజార్చుకోలేదు. తాను ఆడిన 125వ బంతికి తొలి బౌండరీ కొట్టిన ఈ మిస్టర్‌ డిఫెన్స్‌.. 13.31 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. మరో పక్క వికెట్లు పడుతున్నా.. ఆమ్లా క్రీజులో నిలవడంతో సర్రే మ్యాచ్‌ ముగిసే సమయానికి 122/8తో నిలిచింది. దీంతో ఆ జట్టు మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. ఈ క్రమంలో ఆమ్లా ఓ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ రికార్డును తిరగరాశాడు. 40లోపు పరుగులు(37*) సాధించేందుకు అత్యధిక బంతులను(278) ఎదుర్కొన్న క్రికెటర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. ఆమ్లా ఆడిన ఈ మాస్టర్‌ క్లాస్‌ డిఫెన్సివ్‌ ఇన్నింగ్స్‌పై నెట్టింట జోకులు పేలుతున్నాయి. నయా వాల్‌ చతేశ్వర్ పుజారా మాదిరిగా ఆమ్లా కూడా జట్టును రక్షించాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement