![HCA: Women Circket Coach Jaisimha Repsponse Over Allegations - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/17/coachdrink.jpg.webp?itok=t3qlpbXq)
సాక్షి, హైదరాబాద్: ఆయన రాష్ట్ర సీనియర్ మహిళల క్రికెట్ జట్టు కోచ్... టీమ్‌తో పాటు మ్యాచ్ కోసం బస్సులో ప్రయాణిస్తున్నారు... ఎంతో బాధ్యతగా, హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి కట్టు తప్పారు. బస్సులోనే మద్యం బాటిల్ తీసి దర్జాగా సేవించారు. ఆపై ముందు సీట్లో దానిని పెట్టుకొని అదే కొనసాగించారు!
ఈ వీడియో వెలుగులోకి రావడంతో వ్యవహారం బయటపడింది. హైదరాబాద్ మహిళల టీమ్‌కు హెడ్ కోచ్‌గా ఉన్న విద్యుత్ జైసింహ చేసిన నిర్వాకమిది. ఈ ఘటనపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వెంటనే స్పందించింది. జైసింహను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
సస్పెన్షన్ వేటు
పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడంతో పాటు విచారణ ముగిసే వరకు హైదరాబాద్ క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి వ్యవహారాల్లో పాలుపంచుకోరాదని ఆదేశించింది. ఈ ఘటన ఎప్పటిదనే విషయంపై స్పష్టత రాలేదు.
ఇదిలా ఉంటే.. బస్సులోకి ఆల్కహాల్‌ను ఎవరు తీసుకొచ్చారు, ఎలా అనుమతించారనే దానిపై కూడా విచారణ చేస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు ప్రకటించారు.
అంతా అబద్ధం.. అసలు కారణం ఇదే! అవునా?
పాతతరం క్రికెట్ దిగ్గజం ఎంఎల్ జైసింహ కుమారుడైన విద్యుత్ గతంలో హెచ్‌సీఏలో వేర్వేరు బాధ్యతల్లో పని చేశారు. తండ్రి పేరుతోనే సికింద్రాబాద్‌లో చాలా ఏళ్లుగా ఒక ప్రైవేట్ క్రికెట్ అకాడమీని కూడా నిర్వహిస్తున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను విద్యుత్ జైసింహ ఖండించారు.
తానెప్పుడూ టీమ్ బస్సులోకి మద్యాన్ని తీసుకురాలేదని, తాగలేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు నిరాధారమని... ఒక హైదరాబాద్ మాజీ క్రికెటర్ కుమార్తెను జట్టులోకి ఎంపిక చేయకపోవడంతో ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జైసింహ వివరణ ఇచ్చారు.
జై సింహా ప్రవర్తన గురించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు అప్పట్లోనే లేఖ
కోచ్ జై సింహా తాగుడుకు బానిసగా మారారని మహిళా క్రికెటర్లు ఆరోపించారు. తమ ముందు మద్యం తాగొద్దని పలుసార్లు వారించినా వినలేదని, ఇదేంటని ప్రశ్నిస్తే టీం నుంచి తీసేస్తానని బెదిరించారన్నారు. ఈ క్రమంలో.. మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. గత జనవరిలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు జనవరిలో లేఖ కూడా రాశారు.
Comments
Please login to add a commentAdd a comment