సచిన్ టెండుల్కర్‌తో చిన్నారి పృథ్వీ షా (PC: Prithvi Shaw)
క్రికెట్ వర్గాల్లో ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పృథ్వీ షా. ఒకప్పుడు సచిన్ టెండుల్కర్ వారసుడిగా నీరాజనాలు అందుకున్న ఈ ముంబైకర్.. ఇప్పుడు కెరీర్‌లో చాలా వెనుకబడిపోయాడు. ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చినా.. ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడిని పట్టించుకోలేదు.
ఫలితంగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు పృథ్వీ. ఇందుకు ప్రధాన కారణం ఫిట్‌నెస్ లేమితో పాటు క్రమశిక్షణా రాహిత్యమనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది మాజీ క్రికెటర్లు పృథ్వీ షాకు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని.. కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఘాటుగానే విమర్శిస్తున్నారు.
తల్లి లేదు.. తండ్రికి వ్యాపారంలో నష్టం..
ఈ నేపథ్యంలో పృథ్వీ షా చిన్ననాటి కోచ్ రాజు పాఠక్.. ఈ బ్యాటర్ గురించి పెద్దగా ఎవరికీ తెలియని కొన్ని విషయాలు బయటపెట్టాడు. ‘‘వాళ్ల ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఏం ఉండేది కాదు. అతడి తండ్రి వ్యాపారం మొదలుపెట్టి నష్టాలపాలయ్యారు. అందువల్ల షా చిన్నప్పటి నుంచి ఇతరుల సాయంపై ఆధారపడేవాడు.
అలా ప్రతిదానికి ఇతరుల వద్ద చేయి చాచినట్లుగా ఉండటం మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఇక అతడికి తల్లి కూడా లేదు. అతడు అంతగా పరిణతి చెందక ముందే ఆమె కన్నుమూసింది. ఎవరికైనా తల్లి ఉంటేనే కదా.. తప్పొప్పుల గురించి సరిగ్గా తెలుస్తుంది.
ఒక్కసారిగా అకౌంట్లో లెక్కకు మిక్కిలి డబ్బులు పడగానే
ఎన్ని కష్టాలు ఉన్నా.. ఆటపై దృష్టి పెట్టి చిన్న వయసులోనే విజయవంతమైన క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. చిన్నపుడు డబ్బుల్లేక పేదరికంలో మగ్గిన ఓ కుర్రాడు.. ఒక్కసారిగా అకౌంట్లో లెక్కకు మిక్కిలి డబ్బులు పడగానే మారిపోవడం సహజం.
అతడు కూడా జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకున్నాడు. దాదాపుగా అందరూ ఇదే పని చేస్తారు. తమకు నచ్చినట్లుగా జీవించాలని భావిస్తారు. పేరు ప్రఖ్యాతులు, డబ్బు కారణంగా కొంతమంది విలాసాలకు అలవాటు పడతారు.
పృథ్వీ షా 25 ఏళ్ల కుర్రాడు
అయినా పృథ్వీ షా కేవలం 25 ఏళ్ల కుర్రాడు. అతడిని 40 ఏళ్ల, పరిణతి చెందిన మనిషిగా ఉండాలని కోరుకోవడం వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి’’ అని రాజు పాఠక్ పృథ్వీ షాను విమర్శించే వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాలో చోటు కరువు
కాగా 2018లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన పృథ్వీ షా తొలి టెస్టులోనే శతకంతో మెరిశాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోతాడని భావించగా.. శుభ్‌మన్ గిల్‌తో పోటీలో వెనుకబడి జట్టుకు దూరమయ్యాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున పృథ్వీ షా ఐదు టెస్టులు, ఆరు వన్డేలు.. ఆయా ఫార్మాట్లలో 339, 189 పరుగులు చేశాడు.
ఒకే ఒక్క టీ20 ఆడినప్పటికీ పరుగుల ఖాతా తెరవలేదు. ఇక గత వేలం సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీని ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో ఈసారి వేలానికి ముందే రిలీజ్ చేసింది. ఇక ఐపీఎల్ కెరీర్‌లో పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడి 1892 రన్స్ సాధించాడు.
చదవండి: ఒకప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడిలా! కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్..
Comments
Please login to add a commentAdd a comment