బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం మూడు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, చారిత్రక విజయం సాధించగా.. ఆసీస్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు మైండ్‌గేమ్ (అశ్విన్ డూప్‌తో నెట్స్‌లో సాధన) అంటూ ఓవరాక్షన్ చేసిన ఆసీస్ టీమ్.. తుది జట్టు ఎంపిక (భీకర ఫామ్‌లో ఉన్న ట్రవిస్ హెడ్ స్థానంలో వార్నర్ ఎంపిక), బ్యాటింగ్ (మ్యాచ్ మొత్తంలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోవడం), బౌలింగ్ (రోహిత్ సెంచరీ కాకుండా టెయిలెండర్ల సాయంతో భారత్ 400 పరుగులు చేయడం), ఫీల్డింగ్ (పలు క్యాచ్‌లు జారవిడచడం).. ఇలా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఘోర పరాభవం మూటగట్టుకుంది.
ఈ పరాభవాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఆసీస్ మాజీలు కొందరు పిచ్‌పై నెపం మోపడం భారత అభిమానులతో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంలో కొందరు ఆస్ట్రేలియన్లు చేస్తున్న విషప్రచారాన్ని ఆ దేశ మీడియా కూడా ఖండించింది. ఒకవేళ నిజంగా పిచ్‌లో లోపాలు ఉండివుంటే టీమిండియా 400 పరుగులు ఎలా సాధించగలిగిందని ప్రముఖ ఆసీస్ దినపత్రికలు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, సిడ్నీ టెయిలీ టెలిగ్రాఫ్ ప్రశ్నించాయి.
ప్రపంచ నంబర్ వన్ జట్టు అని బీరాలు పలికే ఆసీస్ టీమ్.. రెండు ఇన్నింగ్స్‌ల్లో (177, 91) కలిపి ముగ్గురు భారత ఆటగాళ్లు (రోహిత్ 120, అక్షర్ 84, జడేజా 70) సాధించిన స్కోర్ కూడా సాధించలేకపోవడంపై సదరు పత్రికలు మండిపడ్డాయి. తొలి టెస్ట్‌లో ఆసీస్ అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైందని, ఇకనైనా వాస్తవాలను గ్రహించి, తప్పులను సరిదిద్దుకోకపోతే 0-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించాయి.
భారత స్టార్ స్పిన్ ద్వయం అశ్విన్ (23, 3/42, 5/37), జడేజా (70, 5/47, 2/34), బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పోటీపడి మరీ సత్తా చాటితే, వరల్డ్ టాప్ క్లాస్ బ్యాటర్లుగా చెప్పుకునే వార్నర్, స్మిత్, లబూషేన్‌లు కనీసం హాఫ్‌సెంచరీ కూడా సాధించలేకపోయారని దుమ్మెత్తిపోశాయి. మెలికలు తిరిగే పిచ్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధిస్తే జట్టు మొత్తం కలిసి సెకెండ్ ఇన్నింగ్స్‌లో(91) అతను చేసిన స్కోర్ కూడా చేయలేకపోయిందని తూర్పారబెట్టాయి.
భారత స్పిన్ ద్వయం తమ ప్రదర్శనతో మీరు నిజంగా అగ్రస్థానానికి అర్హులేనా అన్న రీతిలో ప్రశ్నించాయని తమ కథనాల్లో పేర్కొన్నాయి. ట్రవిస్ హెడ్‌ను ఆడించకపోవడం తొలి రోజు సిల్లీగా అనిపించిందని, మూడో రోజు ఘోర తప్పిదంగా తేలిందని విశ్లేషించాయి. ప్రపంచ టాప్ జట్టు ర్యాంకింగ్స్‌లో తమ కంటే ఓ స్థానం కింద ఉన్న జట్టు చేతిలో ఘోరంగా ఓటమిపాలైనందుకు సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశాయి. జట్టులో సమూల మార్పులకు సమయం ఆసన్నమైందని, రెండో టెస్ట్ కోసం ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెట్టాలని సూచించాయి.
కాగా, తొలి టెస్ట్‌లో విజయంతో భారత్ 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 17 నుంచి న్యూఢిల్లీ వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment