డబ్ల్యూటీసీ ఫైనల్‌లో శార్దూల్ ఠాకూర్‌తో రహానే
‘‘రవీంద్ర జడేజా గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదో నాకైతే అర్థం కావడం లేదు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ అతడు ప్రధాన ఆటగాడిగా సేవలు అందిస్తున్నాడు. టెస్టుల్లోనూ అతడి రికార్డులు మెరుగ్గా ఉన్నాయి. మరి తదుపరి నాయకుడు ఎవరన్న చర్చ వచ్చినపుడు జడేజా పేరు ఎందుకు పరిగణనలోకి తీసుకోరు?
గిల్ కూడా ఉన్నాడుగా
నిజానికి మూడు ఫార్మాట్లలోనూ అతడి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాడు లేడు. టీమిండియాను ముందుకు నడిపించ గల సత్తా అతడిలో ఉంది. ఒకవేళ జడేజా పేరును పరిశీలనలోకి తీసుకోకపోతే.. శుబ్‌మన్ గిల్ ఉన్నాడు కదా! టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమైన గిల్ పేరునైనా పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి యువకుడైన యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లకు చోటివ్వడం బాగుంది.
మెల్లమెల్లగా యువ రక్తం ఎక్కిస్తున్నారు. కానీ అజింక్య రహానేను వైస్ కెప్టెన్ చేయడం వెనుక లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. టెస్టు జట్టులో స్థానం కోల్పోయి మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత అతడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు.
రహానే ఏం చేశాడు?
అందులో అద్భుతంగా రాణించిన మాట వాస్తవమే. అయితే, భవిష్యత్ టీమిండియా నిర్మిస్తున్నపుడు మళ్లీ అజింక్య రహానేనే వైస్ కెప్టెన్‌గా నియమించే బదులు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు కదా?
రోహిత్ శర్మ వారసుడిగా ఎదగగల లక్షణాలు ఉన్న ఆటగాడికి డిప్యూటీగా బాధ్యతలు అప్పగిస్తే బాగుండు’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో బీసీసీఐ ఇటీవల టెస్టు, వన్డే జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అదరగొట్టి
ఇందులో భాగంగా టెస్టు జట్టులో స్థానం పొందిన అజింక్య రహానే తిరిగి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడిన రహానే.. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జట్టుకు ఎంపికయ్యాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం దక్కించుకున్న రహానే దానిని సద్వినియోగం చేసుకున్నాడు.
రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 89, 46 పరుగులు చేశాడు. దీంతో సెలక్టర్లు అతడికి మరోసారి కెప్టెన్ డిప్యూటీగా అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సబా కరీం ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా రవీంద్ర జడేజా 2021లో చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు చేపట్టి మధ్యలోనే చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో జట్టును నడిపించలేని జడ్డూకు జాతీయ జట్టు బాధ్యతలు అప్పగించాలని సబా కరీం వ్యాఖ్యానించడంపై క్రికెట్ ప్రేమికుల్లో చర్చ మొదలైంది.
వెస్టిండీస్ రెండు టెస్టులకు భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
చదవండి: మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్ బరువు! అందుకే..
ఈసారి హోరాహోరీ తప్పదు.. ట్రోఫీ ఆ జట్టుదే: భారత మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment