సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే! | How India Qualify Semi-Final In Women's-T20 WC-Match-Lost-Vs-South Africa | Sakshi
Sakshi News home page

Women-T20 WC: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ సెమీస్‌ చేరాలంటే!

Jun 22 2026 11:45 AM | Updated on Jun 22 2026 11:56 AM

How India Qualify Semi-Final In Women's-T20 WC-Match-Lost-Vs-South Africa

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఓట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ మారిజెన్ కాప్ (45 బంతుల్లో 81 నాటౌట్‌) సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంతో సౌతాఫ్రికా రెండు విజ‌యాలు సాధించి ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉంది. 

మ‌రోవైపు బంగ్లాదేశ్ కూడా మూడు మ్యాచ్‌ల్లో రెండు విజ‌యాల‌తో నాలుగో స్థానంలో ఉంది. అయితే భార‌త్ తొలి రెండు మ్యాచ్‌లు (పాకిస్తాన్‌, నెద‌ర్లాండ్స్‌) భారీ తేడాతో గెల‌వ‌డంతో మెరుగైన‌ నెట్ ర‌న్‌రేట్ (+2.511) కార‌ణంగా ప‌ట్టిక‌లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ కంటే ముందుంది. ఈ నేప‌థ్యంలో అన్ని జ‌ట్ల‌కు త‌లా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌డం, ఆసీస్ ఆడిన మూడింట గెలిచి సెమీస్ రేసులో ఒక మెట్టు పైనే ఉంది. అయితే హ‌ర్మ‌న్ సేన సెమీస్ చేరడానికి ఎన్ని అవ‌కాశాలు ఉన్నాయో ఒకసారి ప‌రిశీలిద్దాం.

సెమీస్‌ అవకాశాలు ఇలా..
భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు తమ చివరి రెండు మ్యాచ్‌లను ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలోనూ హ‌ర్మ‌న్ సేన గెలిస్తే 8 పాయింట్ల‌తో నెట్ ర‌న్‌రేట్‌తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌లో అడుగుపెట్ట‌నుంది. అలా కాకుండా ఒక మ్యాచ్‌లో గెలిచి మ‌రో మ్యాచ్‌లో ఓడితే మాత్రం నెట్ ర‌న్‌రేట్ కీల‌కం కానుంది. 

అదే స‌మ‌యంలో సౌతాఫ్రికా కూడా తాను ఆడ‌బోయే రెండింటిలో ఒక దానిలో ఓడిపోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ల‌తో పోలిస్తే భార‌త్ ర‌న్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాపై ఓడినా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే  భార‌త జ‌ట్టుకు సెమీస్ చేరే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. 

ఒక‌వేళ బంగ్లాదేశ్ మ‌న‌పై విజ‌యం సాధిస్తే మాత్రం ర‌న్‌రేట్ ప‌డిపోయి హ‌ర్మ‌న్ సేన ఎలిమినేట్ అయ్యే అవ‌కాశాలుంటాయి. ఇక హ‌ర్మ‌న్ సేన తాము ఆడ‌బోయే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓట‌మిపాలైతే మాత్రం ఎలాంటి స‌మీక‌ర‌ణాలు అవ‌స‌రం లేకుండా టోర్నీ నుంచి నేరుగా నిష్క్ర‌మిస్తుంది. అప్పుడు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లో ఒక జ‌ట్టు సెమీస్ చేరుతుంది. 

మ‌రోవైపు ఆస్ట్రేలియా మాత్రం మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క‌టి గెలిచినా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంటుంది. అప్పుడు గ్రూప్‌-బి నుంచి మ‌రో సెమీస్ స్థానానికి భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌పోటీప‌డాల్సి వ‌స్తోంది. మ్యాచ్ విష‌యానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 158 ప‌రుగులు చేసింది.

ఓపెన‌ర్ ష‌ఫాలీ వ‌ర్మ (31) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, దీప్తిశ‌ర్మ (29), హ‌ర్మ‌న్‌ప్రీత్ (24) ప‌ర్వాలేద‌నిపించారు. స‌ఫారీ బౌల‌ర్ల‌లో మారిజెన్ కాప్‌, ష‌బ్న‌మ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంత‌రం ద‌క్షిణాఫ్రికా కాప్ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో 19.1 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 161 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. తంజిమ్ బ్రిట్స్ (40), లారా వోల్వ‌ర్ట్ (20) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో శ్రీ చ‌ర‌ణి మూడు వికెట్లు ప‌డ‌గొట్టింది.

చదవండి: కొంప‌ముంచిన రెడ్‌కార్డ్‌.. బెల్జియంకు ఇరాన్ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement