
పాకిస్తాన్ ఆటగాడు హైదర్ అలీ విచిత్రరీతిలో స్టంపౌట్ అవ్వడం ఆసక్తి కలిగించింది. విటాలిటీ టి20 బ్లాస్ట్ టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. స్పిన్నర్ బ్రిగ్స్ వేసిన ఫుల్ లెన్త్ బంతిని బాదేందుకు క్రీజులో నుంచి బయటికి వచ్చి బీట్ అయ్యాడు హైదర్. అయితే, బంతిని పట్టడంలో మొదట బర్మింగ్‍హామ్ కీపర్ అలెక్స్ డేవియస్ తడబడ్డాడు. గ్లవ్‍లో తొలుత సరిగా ఒడిసిపట్టలేకపోయి, రెండో ప్రయత్నంలో పట్టుకున్నాడు.
ఆలోగానే హైదర్ అలీ క్రీజులోకి వచ్చాడు. అయితే బంతి కీపర్ అలెక్స్ చేతిలో ఉందని గమనించని హైదర్ అలీ పరుగులు తీసేందుకు క్రీజు దాటి మళ్లీ ముందుకు పరుగెత్తాడు. ఆ సమయంలో వికెట్లను గిరాటేశాడు కీపర్ అలెక్స్. దీంతో షాకైన హైదర్ అలీ (48 పరుగులు).. స్టంపౌట్‍గా పెవిలియన్ చేరాడు.
హైదర్ అలీ స్టంపౌట్ అయిన వీడియోను విటాలిటీ బ్లాస్ట్.. ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొందరు హైదర్ అలీని ట్రోల్ చేస్తున్నారు. హైదర్ మందు కొట్టినట్టున్నాడంటూ ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశారు. అతడి కెరీర్‌లాగే హైదర్ అలీ తికమకపడ్డాడని మరో యూజర్ రాసుకొచ్చారు. అలీ దిమ్మతిరిగిందని మరికొందరు ట్రోల్ చేశారు.
ఈ మ్యాచ్‍లో డెర్బీషైర్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బర్మింగ్‍హామ్ బియర్స్ 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో డెర్బీషైర్ చేజ్ చేసింది. డెర్బీ షైర్ కెప్టెన్ డు ప్లూయీ (25 బంతుల్లో 66, నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. సిక్సర్ల మోత మోగించి చివరి వరకు ఉండి సత్తాచాటాడు.
Make sense of this Haider Ali stumping 👀 #Blast23 pic.twitter.com/d1iD6t1yMZ
— Vitality Blast (@VitalityBlast) June 7, 2023