ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో తన ప్రయాణం ఇంకా ముగిసిపోలేదని పేర్కొన్నాడు. వేలంపాటలో ఫ్రాంఛైజీ తనను తిరిగి కొనుక్కునే అవకాశం ఉందన్నాడు.
బాధ లేదు..
ఇక రిటెన్షన్ విషయంలో ఆర్సీబీ వ్యూహాలు పక్కాగా ఉన్నాయన్న మాక్సీ.. తనను విడిచిపెట్టడం వల్ల పెద్దగా బాధ కలగలేదని తెలిపాడు. కాగా ఈసారి ఆర్సీబీ కేవలం ముగ్గురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి సహా రజత్ పాటిదార్, యశ్ దయాళ్‌లను అట్టిపెట్టుకుని.. మిగతా ప్లేయర్లందరినీ రిలీజ్ చేసింది.
ఈసారి పర్సు వాల్యూ రూ. 120 కోట్లకు పెంచడంతో.. రిటెన్షన్స్ పోనూ ఆర్సీబీ పర్సులో రూ. 83 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాక్స్‌వెల్ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వారు ఏం చేయబోతున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. పటిష్టమైన జట్టును నిర్మించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
ఆర్సీబీతో నా ప్రయాణం ఇంకా ముగియలేదు
ముఖ్యంగా స్థానిక ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటికీ ఆర్సీబీతో నా ప్రయాణం ఇంకా ముగియలేదు. నేను తిరిగి అక్కడికి వెళ్లాలనే కోరుకుంటున్నాను. ఆర్సీబీ అద్భుతమైన ఫ్రాంఛైజీ. అక్కడి వారితో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.
రిటెన్షన్ సమయంలోనూ నాకు వారి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఆండీ ఫ్లవర్ , మొ బొబాట్ నాకు జూమ్ కాల్‌లో అంతా వివరించారు. వారి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పారు. నాకు వారు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు.
నిరాశపరిచిన మాక్సీ
కాగా పదకొండు కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కొనుగోలు చేస్తే మాక్సీ ఐపీఎల్-2024లో ఆర్సీబీ యాజమాన్యాన్ని పూర్తిగా నిరాశపరిచాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 52 పరుగులే చేశాడు. అయితే, తనదైన రోజు చెలరేగి ఆడే ఈ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ను ఆర్సీబీ రైట్ టూ మ్యాచ్ కార్డు ద్వారా తిరిగి సొంతం చేసుకున్నా ఆశ్చర్యం లేదు.
ఇక ఆర్సీబీ స్టార్, టీమిండియా కింగ్ విరాట్ కోహ్లితో మాక్సీకి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. నవంబరు 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరంలో ఐపీఎల్-2025 మెగా వేలం జరుగనుంది.
చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే
Comments
Please login to add a commentAdd a comment