క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (జూన్ 27) ప్రకటించనుంది. ఉదయం 11:30 గంటలకు ముంబైలో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ కార్యవర్గ సభ్యులు షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. వరల్డ్‌కప్ ప్రారంభ తేదీ అయిన అక్టోబర్ 5కు జూన్ 27 సరిగ్గా 100 రోజులు ముందుండంతో ఐసీసీ ఈ తేదీన షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించింది.
కాగా, బీసీసీఐ-పీసీబీల మధ్య వరల్డ్‌కప్ వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో షెడ్యూల్ ప్రకటన ఆలస్యం అయిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐతో పలు చర్చల అనంతరం పీసీబీ ఈ విషయంలో అంగీకారం తెలిపినట్లు సమాచారం. అహ్మదాబాద్‌లో భారత్‌తో తలపడేందుకు పాక్ ఒప్పుకుందని తెలుస్తోంది. అలాగే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌లతో బెంగళూరు, చెన్నైలలో మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ అంగీకారం తెలిపిందని సమాచారం.
ఇదిలా ఉంటే, వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ (అక్టోబర్ 5), ఫైనల్ మ్యాచ్‌లకు (నవంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా ఖరారైందని తెలుస్తోంది. భారత్.. తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను, రెండో మ్యాచ్‌లో (అక్టోబర్ 11) ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొట్టవచ్చని సమాచారం. చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 15న జరగవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment