భారత కెప్టెన్ రోహిత్ శర్మ- ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్
ICC World Test Championship 2021 - 2023: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021- 23 సీజన్ ఫైనల్ తేదీని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఖరారు చేసింది. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఓవల్ వేదికగా జూన్ 7న ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుందని పేర్కొంది. జూన్ 12ను రిజర్వుడేగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా తొలి డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన జట్టుగా న్యూజిలాండ్ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.
కివీస్‌దే తొలి ట్రోఫీ
ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియాను ఓడించి తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. ఇక తాజా సీజన్‌లో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకునే క్రమంలో ఆస్ట్రేలియా, టీమిండియా పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు టాప్-2లో ఉన్న ఈ రెండు పటిష్ట జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి ఆరంభం కానున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కీలకం కానుంది.
టీమిండియా- ఆసీస్ పోటాపోటీ
అయితే, ఆస్ట్రేలియా 136 పాయింట్ల(75.56 పర్సంటైల్)తో డబ్ల్యూటీసీ పట్టికలో ప్రథమ స్థానంలో ఉండగా.. భారత్ 99 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ సిరీస్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏకపక్షంగా సిరీస్ గెలిస్తే నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అలా అయితే కంగారూలకు కష్టాలు తప్పవు.
ప్రస్తుత సమీకరణల దృష్ట్యా ఆసీస్ దాదాపు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్నట్లనిపిస్తున్నా.. శ్రీలంక, సౌతాఫ్రికా జట్లకు మిగిలి ఉన్న సిరీస్‌ల ఫలితాలు తేలే వరకు వేచి చూడాల్సిందే. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న శ్రీలంక, సౌతాఫ్రికా మిగిలిన సిరీస్‌లు ఆడిన తర్వాతే ఫైనలిస్టులకు సంబంధించి స్పష్టత వస్తుంది.
ది ఓవల్ క్రికెట్ స్టేడియం
ఇక క్రికెట్ మక్కాగా పిలుచుకునే ప్రఖ్యాత లార్డ్స్ మైదానం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ గతంలో ప్రకటించింది. అయితే, ఆ తర్వాత ఓవల్‌కు వేదికను మార్చింది. కాగా ఓవల్ స్టేడియం దక్షిణ లండన్‌లోని కెన్నింగ్‌టన్‌లో ఉంది. 1845లో దీనిని ప్రారంభించారు.
అప్పటి నుంచి ఇది సర్రే క్రికెట్ కంట్రీ క్లబ్‌కు హోం గ్రౌండ్‌గా ఉంది. 1880లో మొదటి అంతర్జాతీయ టెస్టుకు ఇంగ్లండ్ ఇక్కడే ఆతిథ్యమిచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రతి సీజన్‌లో స్వదేశంలో ఆఖరి టెస్టును ఇంగ్లండ్ ఇక్కడే ఆడటం ఆనవాయితీగా కొనసాగుతోంది.
చదవండి: Rohit Sharma: 'పిచ్‌పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్ పెట్టండి'
Rishabh Pant: 'స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే హాయిగా ఉంది'
Comments
Please login to add a commentAdd a comment