డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ (PC: ICC)
3 USA venues locked in for ICC Men's T20 WC 2024: ఐసీసీ మెన్స్ వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక ప్రకటన చేసింది. అమెరికాలోని మూడు ప్రధాన నగరాలు ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. న్యూయార్క్, ఫ్లోరిడా, డల్లాస్‌లను టీ20 ప్రపంచకప్ వేదికలుగా ఎంపిక చేసినట్లు బుధవారం ధ్రువీకరించింది.
మొట్టమొదటిసారి
కాగా వెస్టిండీస్‌తో కలిసి యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈసారి పొట్టి ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధమైన విషయం తెలిసిందే. మొట్టమొదటిసారి ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను అమెరికా దక్కించుకోగా.. వేదికల ఎంపికలో ఐసీసీ తాజాగా తుది నిర్ణయం తీసుకుంది.
న్యూయార్క్‌లోని నసౌవ్ కౌంటీ, డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రొవార్డ్ కౌంటీ అసోసియేషన్‌లకు ఈ మేరకు శుభవార్త చెప్పింది. ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. సీటింగ్ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఫ్యాన్స్ కోసమే
ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గాఫ్ అలార్డిస్ మాట్లాడుతూ.. అతిపెద్ద ఐసీసీ ఈవెంట్‌కు అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతుండటం సంతోషంగా ఉందన్నాడు. అమెరికాలో క్రికెట్ పట్ల ఆదరణ రోజురోజుకీ పెరుగుతుండటం.. ఫ్యాన్‌బేస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. సొంత నగరాల్లోనే మేటి క్రికెట్ మ్యాచ్‌లు నేరుగా వీక్షించేందుకు యూఎస్‌ఏలోని క్రికెట్ ఫ్యాన్స్‌కు అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.
కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరోసారి క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం దొరకనుంది. కాగా గతేడాది ఆస్ట్రేలియాలో నిర్వహించిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
చదవండి: సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా.. ఏకంగా..
Comments
Please login to add a commentAdd a comment