అశ్విన్- జేమ్స్ ఆండర్సన్ (PC: ECB)
ICC Men's Test Bowling Rankings: ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. న్యూజిలాండ్‌లో మౌంట్ మాంగనీయ్‌లో జరిగిన తొలి టెస్టులో ఏడు వికెట్లతో సత్తా చాటి.. అగ్రస్థానానికి ఎగబాకాడు. దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి ర్యాంకుకు చేరుకున్నాడు. ఆండర్సన్ ఈ ఫీట్ నమోదు చేయడం ఇది ఆరోసారి.
ఆస్ట్రేలియా కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్, టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానం ఆక్రమించాడు. ఈ క్రమంలో ఆండర్సన్ 87 ఏళ్ల నాటి రికార్డు బద్దలు కొట్టాడు.
87 ఏళ్ల రికార్డు బద్దలు
అత్యధిక వయసులో టెస్టు నంబర్ 1 బౌలర్‌గా అవతరించిన క్రికెటర్‌గా నిలిచాడు. 40 ఏళ్ల 207 రోజుల వయసులో ఈ ఫీట్ నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం క్లారీ గ్రిమెట్ పేరిట ఉండేది. 1936లో 44 ఏళ్ల 2 నెలల వయసులో ఆయన ఈ ఘనత సాధించాడు. ఇక ప్రస్తుతం యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో 40 ఏళ్ల దాకా జట్టులో కొనసాగడం కాస్త కష్టమే. కాబట్టి ఇప్పటికైతే ఆండర్సన్ రికార్డుకు ఎసరు పెట్టేవాళ్లు లేరని చెప్పవచ్చు.
మొదటి ర్యాంకుకు అశ్విన్‌తో పొంచి ఉన్న ప్రమాదం
ఇక కివీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన ఆండర్సన్ ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అగ్రస్థానానికి ఎగబాకి మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, టీమిండియా స్పిన్నర్ అశ్విన్‌తో ఆండర్సన్ మొదటి ర్యాంకుకు ప్రమాదం పొంచి ఉంది.
ఇంగ్లండ్‌కు కివీస్‌తో ప్రస్తుతం మిగిలి ఉన్నది ఒకే ఒక టెస్టు. దీంతో ఆండర్సన్ న్యూజిలాండ్‌తో మిగిలిన మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో వేచిచూడాల్సి ఉంది. అదే సమయంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు అశ్విన్.
అశూకు నల్లేరు మీద నడకే
ఆసీస్‌తో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో అదీ తనకు అచ్చొచ్చిన పిచ్‌లపై ఈ స్పిన్ బౌలర్ చెలరేగడం ఖాయం. కాబట్టి స్వల్పకాలంలోనే అశ్విన్,.. కేవలం తనకంటే రెండు పాయింట్లు మాత్రమే ఎక్కువగా కలిగి ఉన్న ఆండర్సన్‌ను వెనక్కినెట్టడం సులువే.
ఆసీస్ కెప్టెన్ కమిన్స్‌తో పోటీ ఉందని భావించినా.. అతడు అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వెళ్లడం.. మళ్లీ వస్తాడో లేదో తెలియకపోవడం ర్యాంకింగ్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి అశ్విన్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అగ్రస్థానానికి చేరుకోవడం 36 ఏళ్ల అశూకు నల్లేరు మీద నడకే!
ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే
1. జేమ్స్ ఆండర్సన్- ఇంగ్లండ్- 866 పాయింట్లు
2. రవిచంద్రన్ అశ్విన్- ఇండియా- 864 పాయింట్లు
3. ప్యాట్ కమిన్స్- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు
4. ఓలీ రాబిన్సన్- ఇంగ్లండ్- 820 పాయింట్లు
5. జస్‌ప్రీత్ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు
చదవండి: Bumrah: ‘అలసిపోయాను సర్.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్ చేయనా?’
Women T20 WC: కీపర్ తెలివితక్కువ పనికి మూల్యం చెల్లించుకున్న పాక్
Comments
Please login to add a commentAdd a comment