
ICC Test All Rounders Rankings- Axar Patel: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌ల ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెటరన్ స్పిన్నర్ అశూ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తే.. జడ్డూ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ వికెట్లు తీయలేకపోయినప్పటికీ బ్యాట్‌తో సత్తా చాటాడు.
ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై ఈ ప్రతిష్టాత్మక నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో అశ్విన్ 25 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలవగా.. జడేజా 22 వికెట్లు తీయడంతో పాటు 135 పరుగులు సాధించాడు. ముఖ్యంగా మొదటి, రెండు టెస్టుల్లో టీమిండియా విజయాల్లో జడేజాదే ప్రధాన పాత్ర.
ఈ క్రమంలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న జడ్డూ ఓవరాల్‌గా అశ్విన్‌తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పంచుకున్నాడు. మరోవైపు.. అక్షర్ పటేల్ ఈ ఆసీస్‌తో టెస్టు సిరీస్ తొలి మ్యాచ్‌లో విలువైన 84 పరుగులు సాధించాడు. ఒక వికెట్ తీయగలిగాడు.
బ్యాట్ ఝులిపించిన అక్షర్ పటేల్
ఇక ఢిల్లీ టెస్టులో 74 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. వికెట్లేమీ పడగొట్టలేకపోయాడు. ఇండోర్ టెస్టులో 27 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు.. నిర్ణయాత్మక అహ్మదాబాద్ టెస్టులో 79 పరుగులతో ఆకట్టుకున్నాడు. రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మండలి బుధవారం ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానానికి చేరుకున్న అక్షర్.. ఆల్‌రౌండర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇక ఇప్పటికే రవీంద్ర జడేజా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
తాజాగా అక్షర్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఇంగ్లండ్ సారథి బెన్‌స్టోక్స్‌ను వెనక్కినెట్టి నాలుగో ర్యాంకు సాధించాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లే ఉండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల సత్తా.. టాప్-5లో ఉన్నది వీళ్లే!
1. రవీంద్ర జడేజా- ఇండియా- 431 పాయింట్లు
2. రవిచంద్రన్ అశ్విన్- ఇండియా- 359 పాయింట్లు
3. షకీబ్ అల్ హసన్- బంగ్లాదేశ్- 329 పాయింట్లు
4. అక్షర్ పటేల్- ఇండియా- 316 పాయింట్లు
5. బెన్ స్టోక్స్- ఇంగ్లండ్- 307 పాయింట్లు.
చదవండి: Rishabh Pant: వైరల్‌గా మారిన రిషబ్ పంత్ చర్య
Ind Vs Aus ODIs: భారత్- ఆసీస్ వన్డే సిరీస్.. షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment