టెస్టు క్రికెట్ పునరాగమనంలో అద్బుతంగా ఆడుతున్న టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. సహచర ఆటగాడు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టి.. టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆరోస్థానానికి చేరుకున్నాడు. ఇక ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ తన టాప్ ర్యాంకును కాపాడుకోగలిగాడు.
కారు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ దాదాపు ఏడాదిన్నర తర్వాత కాంపిటేటివ్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్.. వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు సంపాదించాడు. ఆ మెగా టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
టెస్టు రీ ఎంట్రీలోనే శతకం
ఈ క్రమంలో స్వదేశంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన పంత్.. శతకంతో దుమ్ములేపాడు. అంతేకాదు.. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ విలువైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బెంగళూరులో కివీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సహచరులంతా విఫలమైనా ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ 20 పరుగులు చేయగలిగాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌కు ముందు మోకాలి గాయం తిరగబెట్టినా మైదానంలో దిగి.. 99 పరుగులతో తన బ్యాట్ పవర్ చూపించాడు. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. మరోవైపు.. టీమిండియా నుంచి యశస్వి జైస్వాల్ నాలుగు, విరాట్ కోహ్లి ఎనిమిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్ టాప్-5
1. జో రూట్- ఇంగ్లండ్- 917 రేటింగ్ పాయింట్లు
2. కేన్ విలియమ్సన్- న్యూజిలాండ్- 821 రేటింగ్ పాయింట్లు
3. హ్యారీ బ్రూక్- ఇంగ్లండ్- 803 రేటింగ్ పాయింట్లు
4. యశస్వి జైస్వాల్- ఇండియా- 780 రేటింగ్ పాయింట్లు
5. స్టీవెన్ స్మిత్- ఆస్ట్రేలియా- 757 రేటింగ్ పాయింట్లు.
బుమ్రానే టాప్
అదే విధంగా.. టెస్టు బౌలర్ల విభాగంలో టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండు, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్ నాలుగు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, సౌతాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ కగిసో రబాడ వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
టాప్-5లో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరోస్థానానికి చేరుకోగా.. టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో నిలిచాడు.
చదవండి: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు
Comments
Please login to add a commentAdd a comment