అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు సత్తా చాటారు. వెటరన్ క్రికెటర్ జో రూట్ అగ్రస్థానానికి చేరువకాగా.. యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించాడు. అదే విధంగా.. బెన్ డకెట్ ఆరు స్థానాలు మెరుగుపరచుకుని టాప్-20(16వ ర్యాంకు)లో అడుగుపెట్టగా.. ఓలీ పోప్ 8 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంకులో నిలిచాడు.
విండీస్‌ను చిత్తు చేసి
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడే నిమిత్తం వెస్టిండీస్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తూ 241 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
ఈ విజయంలో జో రూట్ కీలక పాత్ర పోషించాడు. కెరీర్‌లో 32వ టెస్టు సెంచరీ(122 రన్స్) నమోదు చేశాడు. ఫలితంగా 12 రేటింగ్ పాయింట్లు మెరుగుపరచుకున్న జో రూట్.. టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.
అగ్రపీఠానికి చేరువైన రూట్
నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ పీఠంపై కన్నేశాడు. మరో ఏడు రేటింగ్ పాయింట్లు సాధిస్తే రూట్ అగ్రస్థానానికి ఎగబాకుతాడు. విండీస్‌తో మిగిలి ఉన్న మూడో టెస్టులోనూ సత్తా చాటితే ఇదేమంత కష్టం కాదు.
భారీ జంప్ కొట్టిన బ్రూక్
ఇక 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ సైతం వెస్టిండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ(109)తో కదంతొక్కాడు. ఈ క్రమంలో నాలుగు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు అందుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఆస్ట్రేలియా వెటరన్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్‌లను వెనక్కి నెట్టి టాప్-3లోకి దూసుకువచ్చాడు.
కాగా ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ(7వ ర్యాంకు), అతడి ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్(8వ ర్యాంకు), విరాట్ కోహ్లి(10వ ర్యాంకు) టాప్-10లో కొనసాగుతున్నారు.
ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్ టాప్-5లో ఉన్నది వీళ్లే
1. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు
2. జో రూట్(ఇంగ్లండ్)- 852 రేటింగ్ పాయింట్లు
3. హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)- 771 రేటింగ్ పాయింట్లు
4. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 768 రేటింగ్ పాయింట్లు
5. డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు.
Comments
Please login to add a commentAdd a comment