మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా ఆసీస్‌తో రేపు (సెప్టెంబర్ 22) జరుగబోయే తొలి వన్డేకు ముందు టీమిండియాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. రేపటి మ్యాచ్‌లో భారత్.. ఆసీస్‌ను ఓడిస్తే, వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకడంతో పాటు ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన రెండో జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుతుంది. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్.. రేపటి మ్యాచ్‌లో గెలిస్తే అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా అరుదైన గుర్తింపు దక్కించుకుంటుంది.
గతంలో ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన ఏకైక జట్టుగా దక్షిణాఫ్రికా పేరిట రికార్డు ఉంది. సఫారీ టీమ్ 2014లో హషీమ్ ఆమ్లా నేతృత్వంలో ఒకేసారి అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలిచింది. అప్పట్లో దక్షిణాఫ్రికా జట్టులో ఏబీ డివిలియర్స్, జాక్ కల్లిస్, గ్రేమ్ స్మిత్, మోర్నీ మోర్కెల్, మఖాయ ఎన్తిని, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి హేమాహేమీలు ఉండేవారు. సౌతాఫ్రికా తర్వాత ఆ ఘనతను భారత్ సాధించిందని ఈ ఏడాది ఆరంభంలో ప్రచారం జరిగినప్పటికీ.. అది ఐసీసీ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం కారణంగానే జరిగిందని తేలడంతో టీమిండియా అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే ఆ అవకాశం భారత్‌కు మళ్లీ ఇప్పుడు వచ్చింది. రేపటి మ్యాచ్‌లో గెలిస్తే సౌతాఫ్రికా తర్వాత ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కుతుంది.
ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు.. రేపటి మ్యాచ్‌లో పటిష్టమైన ఆసీస్‌ను ఎలాగైనా మట్టికరిపించాలని ఉవ్విళ్లూరుతుంది. ఆసీస్ స్టార్ ఆటగాళ్ల గాయాల బెడద ఈ విషయంలో భారత్‌కు తోడ్పడేలా ఉంది. ఆసీస్ కీలక ప్లేయర్లు మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయాల కారణంగా రేపటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఆసీస్‌ను దెబ్బకొట్టేందుకు భారత్‌కు ఇదే సరైన సమయం. మరోవైపు భారత్ సైతం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లి లాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతుంది. వరల్డ్‌కప్‌కు ముందు ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకూడదనే ఉద్దేశంతో భారత సెలక్టర్లు రోహిత్, కోహ్లి సహా పలువురు స్టార్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. వీరంతా మూడో వన్డేలో జట్టుతో కలుస్తారు.
టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
Comments
Please login to add a commentAdd a comment