యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ (DP World ILT20) రెండో ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 19-ఫిబ్రవరి 17 మధ్యలో జరుగనుంది. ఈ లీగ్ కోసం దుబాయ్ క్యాపిటల్స్ తమ నూతన కెప్టెన్‌గా ఆసీస్ వెటరన్ డేవిడ్ వార్నర్‌ను నియమించింది. దుబాయ్ క్యాపిటల్స్.. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తుంది.
రిషబ్ పంత్ గైర్హాజరీలో వార్నర్ గత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వార్నర్‌తో అనుబంధాన్ని కొనసాగించడంలో భాగంగా అతనికి దుబాయ్ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తుంది. అయితే వార్నర్ ఇంటర్నేషనల్ లీగ్ మొత్తానికి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ లీగ్ మొదలయ్యే సమయానికి వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాల్సి ఉంది. వార్నర్ స్వదేశీ లీగ్‌కు మధ్యలోనే హ్యాండ్ ఇచ్చి దుబాయ్ క్యాపిటల్స్‌కు ఆడే అవకాశం ఉండదని తెలుస్తుంది. మరి ఈ రెండు లీగ్‌ల మధ్యలో వార్నర్ ఏ లీగ్‌కు ప్రాధాన్యత ఇస్తాడో వేచి చూడాలి.
కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీ ఇనాగురల్ ఎడిషన్‌లో (2023) దుబాయ్ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రోవ్‌మన్ పావెల్ వ్యవహరించాడు. పావెల్ సారథ్యంలో క్యాపిటల్స్ గత ఎడిషన్ సెమీస్ వరకు చేరింది. ఐఎల్‌టీ20 2023 ఎడిషన్ ఛాంపియన్‌గా గల్ఫ్ జెయింట్స్ నిలిచింది. ఫైనల్లో జెయింట్స్ డెసర్ట్ వైపర్స్‌ను ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. దుబాయ్ క్యాపిటల్స్ జట్టులో ప్రస్తుతం రోవ్‌మన్ పావెల్, జో రూట్, సికందర్ రజా, మార్క్ వుడ్, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment