వెల్లింగ్టన్: గతవారమే భారత్, న్యూజిలాండ్ జట్లు టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ కోసం ప్రత్యర్థి జట్లతో సెమీ ఫైనల్స్ ఆడాయి. ఓటమితో రెండు గ్రూప్ టాపర్స్ జట్ల ఆశలకు అక్కడే తెర పడింది. ఇప్పుడు ఓ రకంగా ఈ మూడు టి20ల సిరీస్‌ను ‘కాంస్యం’ కాని కాంస్య పతక పోరు అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో సెమీఫైనల్స్ సమ ఉజ్జీల మధ్య ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
అయితే ఇక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలాంటి అనుభవజ్ఞులు లేని భారత జట్టు బరిలోకి దిగుతోంది. కానీ మెరుపుల్లో ఇప్పటికే నిరూపించుకున్న ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడాలు ఉన్న టీమిండియా సీనియర్లు లేని లోటును కచ్చితంగా పూరిస్తుంది. వీళ్లంతా ఐపీఎల్‌లో అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొన్నవారే కావడంతో భారత బృందం నుంచి కేన్ విలియమ్సన్ సేనకు కఠిన సవాళ్లు తప్పకపోవచ్చు.
మళ్లీ పాండ్యా సారథ్యంలో...
హార్దిక్ పాండ్యా ఈ ఏడాది సారథిగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించి నిరూపించుకున్నాడు. ఐర్లాండ్ గడ్డపై 2–0తో సిరీస్ సాధించాడు. ఇప్పుడు మాత్రం గట్టి ప్రత్యర్థి న్యూజిలాండ్‌తో జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం రోహిత్ తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యే అర్హతలున్న ఆటగాడిగా కితాబందుకుంటున్న పాండ్యాకు ఈ సిరీస్ సువర్ణావకాశం కల్పిస్తోంది.
ఇలా సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని విజయవంతం చేసుకుంటే మాత్రం 2024 టి20 ప్రపంచకప్‌లో టీమిండియాను నడిపేది కచ్చితంగా పాండ్యానే! ఇందులో ఏ సందేహం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో జట్టును గెలిపిస్తే అద్భుతమే అని చెప్పాలి. సూర్యకుమార్ సూపర్ ఫామ్‌లో ఉండటం, హార్డ్ హిట్టర్లు ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్, ఆల్‌రౌండర్ దీపక్ హుడాలతో టీమిండియా పొట్టిసిరీస్‌కు సరిపోయే మెటిరియల్‌తోనే ఉంది. పైగా గత న్యూజిలాండ్ పర్యటనలో భారత్ 5–0తో చేసిన క్లీన్‌స్వీప్ విజయం జట్టును ఒక మెట్టు పైనే నిలబెట్టుతోంది.
ప్రతీకారంపై కివీస్ కన్ను
సొంతగడ్డపై అనుకూలతలున్నా... టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్ చూస్తోంది. అనుభవజ్ఞులు లేని ప్రపంచ నంబర్‌వన్ టి20 జట్టుపై తొలి మ్యాచ్ నుంచే ఆధిపత్యం కనబరచాలని విలియమ్సన్ సేన ప్రణాళికతో ఉంది. ఆసీస్ గడ్డపై జరిగిన టి20 మెగా ఈవెంట్‌లో ఫిన్ అలెన్, కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ అదరగొట్టారు. ఇప్పుడు సొంతగడ్డపై కూడా అదే జోరు సాగించాలని బ్యాటింగ్ త్రయం ఉవ్విళ్లూరుతోంది. దీంతో పాటు భారత్‌తో పోల్చితే ప్రస్తుత న్యూజిలాండ్ బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది. సీనియర్ సీమర్ బౌల్ట్ లేకపోయినా సౌతీ, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, ఇష్ సోధిలు ఫామ్‌లో ఉన్నారు. వీళ్లంతా ప్రపంచకప్‌లో నిలకడగా రాణించడం వల్లే సూపర్–12 దశలో కివీస్ అగ్రస్థానంలో నిలిచింది.
జట్లు (అంచనా)
భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, అయ్యర్, సూర్యకుమార్, రిషబ్ పంత్, సుందర్, హర్షల్ / ఉమ్రాన్ మలిక్, భువనేశ్వర్, అర్‡్షదీప్, చహల్.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, కాన్వే, ఫిలిప్స్, మిచెల్, నీషమ్, సాన్‌ట్నర్, సౌతీ, ఇష్ సోధి, మిల్నే, ఫెర్గూసన్.
పిచ్, వాతావరణం
సాధారణంగా కివీస్ గడ్డపై జరిగే పొట్టి పోటీల్లో మెరుపులు, భారీస్కోర్లకు కొదవుండదు. కానీ వెల్లింగ్టన్ మాత్రం ప్రతీసారి ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇక్కడ సగటు స్కోరు 162. కాబట్టి ఈ వేదికపై బౌలర్లకూ అవకాశముంటుందని చెప్పొచ్చు. శుక్రవారం వానముప్పు ఉన్నప్పటికీ మ్యాచ్ సమయానికల్లా సర్దుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment