IND Vs NZ 3rd T20I: Match Called Off Due To Rain, India Win The Series 1-0 - Sakshi
Sakshi News home page

IND Vs NZ 3rd T20: అత్యంత అరుదైన 'టై'గా ముగిసిన మ్యాచ్‌.. సిరీస్‌ టీమిండియాదే

Published Tue, Nov 22 2022 4:16 PM | Last Updated on Tue, Nov 22 2022 5:59 PM

IND VS NZ 3rd T20: Match Called Of Due To Rain, Its A Tie On DLS - Sakshi

నేపియర్‌లోని మెక్లీన్‌ పార్క్‌ వేదికగా నూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్‌ 23) జరిగిన సిరీస్‌ డిసైడర్‌ మూడో టీ20 టైగా ముగిసింది. భారత ఇన్నింగ్స్‌ సమయంలో (9 ఓవర్ల తర్వాత 75/4) వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం టైగా ప్రకటించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో మ్యాచ్‌లో 'సూర్య'ప్రతాపం (111 నాటౌట్‌) చూపించడంతో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 

టై ఎలా అంటే..?
మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సమయానికి  టీమిండియా స్కోర్‌ 9 ఓవర్ల తర్వాత 75/4గా ఉంది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 9 ఓవర్ల తర్వాత టీమిండియా గెలిచి ఉండాలంటే 76 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే ఈ సమయానికి స్కోర్లు సమంగా (9 ఓవర్ల తర్వాత 75) ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను  డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం టైగా నిర్ధారించారు. క్రికెట్‌ చరిత్రలో ఇలా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం మ్యాచ్‌లు టైగా ముగిసిన సందర్భాలు ఈ మ్యాచ్‌తో కలిపి మూడు ఉన్నాయి. 2021లో నెదర్లాండ్స్‌-మలేషియా మధ్య జరిగిన మ్యాచ్‌, 2021లో మాల్టా-జిబ్రాల్టర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లు ఇలాగే డక్‌వర్త్‌ లూయిస్‌ టైగా ముగిశాయి.  
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేసింది.  పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌ (4/17), అర్షదీప్‌ సింగ్‌ (4/37), హర్షల్‌ పటేల్‌ చెలరేగడంతో న్యూజిలాండ్‌ తమ కోటా 20 ఓవర్లు ఆడకుండానే 160 పరుగులకు ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌.. ఆరంభంలోనే 2 వికెట్లు (ఫిన్‌ అలెన్‌ (3), మార్క్‌ చాప్‌మన్‌ (12))  కోల్పోయినా డెవాన్‌ కాన్వే (59), గ్లెన్‌ ఫిలిప్స్‌ (54) జట్టును  ఆదుకున్నారు.

అయితే వీరిద్దరు 16 పరుగుల వ్యవధిలో ఔట్‌ కావడంతో న్యూజిలాండ్‌ పతనం ఆరంభమైంది. వీరి తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఏ ఒక్క బ్యాటర్‌​ నిలదొక్కుకోలేకపోయారు. ఏకంగా ముగ్గురు (నీషమ్‌, మిల్నే, సోధి) డకౌట్‌లు అయ్యారు. డారిల్‌ మిచెల్‌ (10) ఒక్కడే రెండంకెల స్కోర్‌ చేశాడు. 

అనంతరం 161 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. కివీస్‌ పేసర్లు సౌథీ (2/27), ఆడమ్‌ మిల్నే (1/23), సోధి (1/12) ధాటికి 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ను (10) మిల్నే ఔట్‌ చేయగా.. మరో ఓపెనర్‌ రిషబ్‌ పంత్‌ (11), శ్రేయస్‌ అయ్యర్‌ (0)లను సౌథీ, సూర్యకుమార్‌ను (13) సోధి పెవిలియన్‌కు పంపారు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 75/4 వద్ద ఉండగా వర్షం మొదలైంది.

దీపక్‌ హుడా (9), హార్ధిక్‌ పాండ్యా (30) క్రీజ్‌లో ఉన్నారు. వర్షం ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్‌ను టైగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లతో చెలరేగిన సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించగా, రెండో టీ20లో శతక్కొట్టిన సూర్యకుమార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో 25 జరిగే తొలి వన్డేతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభమవుతుంది. 27, 30 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement