Ind Vs SA: క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్‌! వీడియో వైరల్‌ | 'Uske Liye Sorry': Rinku Singh Innocently Apologizes For Breaking Media Box Glass - Sakshi
Sakshi News home page

Ind vs SA: కావాలని చేయలేదు.. క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్‌! వీడియో వైరల్‌

Published Wed, Dec 13 2023 12:08 PM | Last Updated on Wed, Dec 13 2023 12:40 PM

Ind v SA Uske Liye Sorry Rinku Innocently Apologizes For breaking Media Box Glass - Sakshi

South Africa vs India, 2nd T20I- Rinku Singh: టీమిండియా తరఫున టీ20లలో అదరగొడుతూ తనదైన ముద్ర వేస్తున్నాడు యువ బ్యాటర్‌ రింకూ సింగ్‌. కీలక సమయంలో విలువైన ఇన్నింగ్స్‌ ఆడుతూ నయా ఫినిషర్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ యూపీ బ్యాటర్‌.. తాజాగా సౌతాఫ్రికా గడ్డ మీద కూడా సత్తా చాటాడు.

రింకూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌
ప్రొటిస్‌ జట్టుతో రెండో టీ20లో ఓపెనర్లు విఫలమైన వేళ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(56)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. కేవలం 39 బంతుల్లోనే 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

అయితే, వర్షం కారణంగా సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి తప్పలేదు. ప్రొటిస్‌ ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ 27 బంతుల్లోనే 49 పరుగులతో చెలరేగగా.. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ 30 పరుగులతో రాణించాడు.

ఈ క్రమంలో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై గెలుపొందింది. ఇదిలా ఉంటే.. పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్‌ బాదిన సిక్సర్‌ కారణంగా మీడియా గ్లాస్‌ బాక్స్‌ బద్దలైన విషయం తెలిసిందే.

సిక్సర్‌ దెబ్బకు అద్దం పగిలింది
పందొమ్మిదవ ఓవర్లో మార్క్రమ్‌ బౌలింగ్‌లో రింకూ స్ట్రెయిట్‌ హిట్‌ కారణంగా సైట్‌స్క్రీన్‌ బ్రేక్‌ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

సారీ చెప్పిన రింకూ.. సో క్యూట్‌ అంటున్న నెటిజన్లు
ఇక ఈ విషయం గురించి మ్యాచ్‌ అనంతరం స్పందించిన రింకూ సింగ్‌.. స్టేడియం నిర్వాహకులకు క్షమాపణలు చెప్పడం విశేషం. ఈ మేరకు బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో తన ప్రదర్శన గురించి మాట్లాడుతున్న సమయంలో.. ‘‘ఆ బంతిని సిక్సర్‌గా మలచాలని మాత్రమే భావించాను.

నా షాట్‌ కారణంగా అద్దం పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. గ్లాస్‌ బ్రేక్‌ చేసినందుకు సారీ చెబుతున్నా’’ అని రింకూ సింగ్‌ పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘సో క్యూట్‌ రింకూ.. నీ ఆటతోనే కాదు అమాయకత్వపు, హుందాతనపు మాటలతోనూ మా మనసులు దోచుకున్నావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఇప్పటి వరకు పలు మ్యాచ్‌లలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ రింకూ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కసారి కూడా యాభై పరుగుల మార్కు అందుకోలేకపోయాడు. అయితే, తాజా టీ20 సందర్భంగా కఠినమైన సఫారీ పిచ్‌లపై తన తొలి ఇంటర్నేషనల్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేయడం విశేషం.

అంతా సూర్య భాయ్‌ వల్లే
ఈ నేపథ్యంలో రింకూ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో సూర్య భాయ్‌ నాకు సూచనలు ఇచ్చారు. ఒత్తిడికి లోనుకాకుండా నీ సహజమైన ఆటనే ఆడమని చెప్పారు. తొందరపాటు తగదు.. భారీ షాట్ల కోసం కాస్త ఓపికగా ఎదురు చూడాలని చెప్పారు.

నిజానికి ఆరంభంలో వికెట్‌ కాస్త కఠినంగా అనిపించింది. అయితే, కాసేపటి తర్వాత షాట్లు ఆడేందుకు వీలు కలిగింది’’ అని తెలిపాడు. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో సూర్య సేనకు ఓటమి ఎదురైంది. ఇక నిర్ణయాత్మక మూడో టీ20 జొహన్నస్‌బర్గ్‌ వేదికగా గురువారం జరుగనుంది.

చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement