టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన దూబే.. భావి భారత కెప్టెన్‌గా అనుకుంటున్న హార్దిక్ పాండ్యా స్థానానికే ఎసరు పెట్టాడు. హార్దిక్ పాండ్యాలా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన దూబే.. హార్దిక్ గైర్హాజరీలో అద్భుతంగా రాణిస్తూ అతని స్థానాన్నే ప్రశ్నార్థకంగా మార్చాడు.
ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తున్న దూబే.. ఇలాగే తన మెరుపులు కొనసాగిస్తే టీమిండియాలో హార్దిక్ స్థానం గల్లంతవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. తరుచూ గాయపడే హార్దిక్ కన్నా దూబే చాలా బెటర్ అని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ హార్దిక్‌ను తీసుకున్నా దూబేని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
30 ఏళ్ల దూబే ఆటతీరులో ఇటీవలికాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఐపీఎల్ 2023 తర్వాత అతను బాగా రాటుదేలాడు. దేశవాలీ క్రికెట్‌లోనూ దూబే సత్తా చాటాడు. చాలాకాలంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోసం ఎదురు చూస్తున్న టీమిండియాకు దూబే కరెక్ట్ మ్యాచ్ అని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో అజేయమైన అర్ధసెంచరీ (60 నాటౌట్) సహా వికెట్ (2-0-9-1) తీసి టీమిండియాను గెలిపించిన దూబే.. రెండో మ్యాచ్‌లోనూ ఇంచుమించు అదే ప్రదర్శనతో (32 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు, 3-0-36-1) భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
కోహ్లి సరసన..
రెండో టీ20 ప్రదర్శనతో దూబే ఏకంగా లెజెండ్ విరాట్ కోహ్లి సరసన చేరాడు. విరాట్ టీ20ల్లో రెండు సార్లు అర్ధసెంచరీతో పాటు వికెట్ తీయగా.. దూబే సైతం అన్నే సార్లు ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక సార్లు ఈ ప్రదర్శన నమోదు చేసిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ నిలిచాడు. యువీ మూడుసార్లు ఓ మ్యాచ్‌లో 50 పరుగులతో పాటు వికెట్ తీశాడు. భారత్ తరఫున హార్ధిక్, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ తలోసారి 50 స్కోర్‌తో పాటు వికెట్ తీశారు.
కాగా, దూబేతో పాటు యశస్వి జైస్వాల్ (34 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో రెండో టీ20లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. సిరీస్ గెలుపుతో భారత్ స్వదేశంలో తమ అజేయ యాత్రను కొనసాగించింది. సొంతగడ్డపై టీమిండియాకు గత 15 టీ20 సిరీస్‌ల్లో (2019 నుంచి) ఓటమిలేదు.
Comments
Please login to add a commentAdd a comment