రోహిత్‌ రనౌట్‌.. తప్పు అతడిదే: టీమిండియా మాజీ బ్యాటర్‌ | IND Vs AFG T20 Series: Gill Should Have Just Trusted Rohit, Ex India Star Blunt Verdict On Rohit Run Out - Sakshi
Sakshi News home page

IND Vs AFG: రోహిత్‌ రనౌట్‌.. తప్పు అతడిదే: టీమిండియా మాజీ బ్యాటర్‌

Published Fri, Jan 12 2024 6:58 PM | Last Updated on Fri, Jan 12 2024 7:44 PM

Ind vs Afg Gill Should Have Just: Ex India Star Blunt Verdict On Rohit Run Out - Sakshi

India vs Afghanistan, 1st T20I - Rohit Sharma Run Out: అంతర్జాతీయ టీ20 పునరాగమనంలో విఫలమైన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు భారత మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్‌ అండగా నిలిచాడు. శుబ్‌మన్‌ గిల్‌ కారణంగానే రోహిత్‌ వికెట్‌ పారేసుకోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. గిల్‌ గనుక సరైన సమయంలో స్పందించి ఉంటే రోహిత్‌ ఆట తీరు మరోలా ఉండేదని పేర్కొన్నాడు.

సుమారు 14 నెలల విరామం తర్వాత రోహిత్‌ శర్మ ఇంటర్నేషనల్‌ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్‌ సందర్భంగా తిరిగి టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన హిట్‌మ్యాన్‌.. ఆరంభ మ్యాచ్‌లోనే రనౌట్‌ అయ్యాడు.

గిల్‌ కదల్లేదు.. రోహిత్‌ రనౌట్‌
మొహాలీ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో రెండో బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌. నిజానికి బంతిని బాదిన తర్వాత వేగంగా క్రీజును వీడిన రోహిత్‌ శర్మ.. తన జోడీ గిల్‌ను పరుగుకు రావాల్సిందిగా పిలిచాడు.

కానీ ఫీల్డర్ల విన్యాసాలు గమనిస్తూ.. బంతిని చూస్తూ అలాగే ఉండిపోయిన గిల్‌ అక్కడి నుంచి కదల్లేదు. అప్పటికే రోహిత్‌.. గిల్‌ ఉన్న ఎండ్‌కి వచ్చేయగా.. అఫ్గనిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ వికెట్లను గిరాటేశాడు. అంతే.. రోహిత్‌ శర్మ సున్నాకే పెవిలియన్‌ చేరాడు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా.. తప్పు ఎవరిదన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పార్థివ్‌ పటేల్‌ స్పందించాడు.

రోహిత్‌ శర్మపై నమ్మకం ఉంచాల్సింది
స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్‌ శర్మపై శుబ్‌మన్‌ గిల్‌ నమ్మకం ఉంచాల్సింది. అంతర్జాతీయ టీ20లలో వాళ్లిద్దరు కలిసి ఓపెనింగ్‌ చేయడం ఇదే తొలిసారి అని తెలుసు.

కానీ వన్డే, టెస్టుల్లో వారిద్దరు ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లలో కలిసి ఆడారు. శుబ్‌మన్‌ గిల్‌ బాల్‌నే చూస్తూ ఉండటం వల్ల సమన్వయలోపం చోటుచేసుకుంది. గిల్‌ అలా చేసే బదులు రోహిత్‌ పిలవగానే పరిగెత్తుకుని వస్తే బాగుండేది’’ అని పార్థివ్‌ పటేల్‌ అభిప్రాయపడ్డాడు.

ఏదేమైనా రీఎంట్రీలో రోహిత్‌ శర్మ ఇలా డకౌట్‌ కావడం నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా అఫ్గనిస్తాన్‌తో మొదటి టీ20లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్‌ సేన.. ఇండోర్‌లో జనవరి 14న రెండో మ్యాచ్‌లో తలపడనుంది.

చదవండి: Ind vs Afg: కావాలనే అలా చేశాం: రోహిత్‌ శర్మ 
Ind vs Afg: కోహ్లి రీఎంట్రీ.. అతడిపై వేటు? సంజూకు మళ్లీ నో ఛాన్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement