వెళ్లడం వరకే నీ ఇష్టం!.. ద్రవిడ్‌ ‘వార్నింగ్‌’ తర్వాత ఇషాన్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Ind vs Afg Ishan Kishan 1st Reaction Since Rahul Dravid Domestic Cricket Message | Sakshi
Sakshi News home page

వెళ్లడం వరకే నీ ఇష్టం!.. ద్రవిడ్‌ ‘వార్నింగ్‌’ తర్వాత ఇషాన్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే

Published Fri, Jan 12 2024 7:54 PM | Last Updated on Fri, Jan 12 2024 9:10 PM

Ind vs Afg Ishan Kishan 1st Reaction Since Rahul Dravid Domestic Cricket Message - Sakshi

Rahul Dravid- Ishan Kishan: టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా క్రికెట్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్‌ ఇంకా సెలవులోనే ఉన్నాడు. 

ఈ నేపథ్యంలో.. అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని భావించినా.. అలా జరుగలేదని టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు.. ఇషాన్‌ మళ్లీ భారత జట్టుతో చేరాలంటే దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సి ఉంటుందంటూ గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు.

ఈ క్రమంలో.. మానసికంగా అలసిపోయానని తనకు తాను తప్పుకొన్న ఇషాన్‌ కిషన్‌.. పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తుండటం బీసీసీఐ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందనే వార్తలు వినిపించాయి.

వెళ్లడం వరకే మీ ఇష్టం.. తిరిగి రావాలంటే
ఈ నేపథ్యంలోనే .. ‘‘జట్టును వీడి వెళ్లాలా వద్దా అనేది మాత్రమే ఆటగాళ్ల ఇష్టం.. వాళ్లను తిరిగి తీసుకోవాలా వద్దా అనేది మాత్రం మా ఇష్టమే’’ అన్న అర్థం ద్రవిడ్‌ మాటల్లో ధ్వనించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వీలైనప్పుడల్లా అవకాశాలు ఇస్తున్నా.. తనను కావాలనే పక్కనపెడుతున్నారని ఇషాన్‌ ఇగోకు పోయి తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటున్నాడనే మాటలూ వినిపిస్తున్నాయి.

రంజీల్లో ఆడతాడో లేదో చెప్పలేదు.. వస్తే మాత్రం
మరోవైపు.. ద్రవిడ్‌ చెప్పిన తర్వాత ఇషాన్‌ కిషన్‌ రంజీ ట్రోఫీ-2024 సీజన్‌లో కచ్చితంగా ఆడతాడని అంతా భావించారు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు ముందు ఇషాన్‌.. దేశవాళీ క్రికెట్‌లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జార్ఖండ్‌ తరఫున బరిలోకి దిగుతాడని ఊహించారు. కానీ.. ఇందుకు సంబంధించి తమకు ఇషాన్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదని జార్ఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి దేబాశిష్‌ చక్రవర్తి వార్తా సంస్థ పీటీఐకి తెలిపాడు.

ఒకవేళ ఇషాన్‌ రంజీల్లో ఆడాలనుకుంటే నేరుగా తుదిజట్టులో చేర్చుకుంటామని స్పష్టం చేశాడు. అయినప్పటికీ ఈ పరిణామాలపై ఇషాన్‌ కిషన్‌ ఇంత వరకు నేరుగా స్పందించకపోవడం గమనార్హం. అయితే, తాజాగా తన సోషల్‌ మీడియా అకౌంట్లో ఓ వీడియోతో ప్రత్యక్షమయ్యాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.

యోగా చేస్తూ, మైదానంలో పరుగులు తీస్తూ
ఇందులో... యోగా చేస్తూ, మైదానంలో పరుగులు తీస్తూ కనిపించాడు. దీనిని బట్టి త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇషాన్‌ చెప్పకనే చెప్పినట్లయింది. అయితే, ఇప్పటికే శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌లతో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌ నుంచి ఓపెనింగ్‌ స్థానానికి ఇషాన్‌ గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు.

మరోవైపు... కేఎల్‌ రాహుల్‌- శ్రీకర్‌ భరత్‌(టెస్టు), సంజూ శాంసన్‌- జితేశ్‌ శర్మ(వన్డే, టీ20లలో) రూపంలో వికెట్‌ కీపర్‌ స్థానానికి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇషాన్‌ కిషన్‌ విషయంలో మేనేజ్‌మెంట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

చదవండి: NZ vs Pak: చరిత్ర సృష్టించిన కివీస్‌ పేసర్‌: ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement