IND Vs AUS: బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం | IND Vs AUS 2nd T20 In Thiruvananthapuram, Match Live Score Updates And Highlights - Sakshi
Sakshi News home page

IND Vs AUS 2nd T20 Highlights: బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం

Published Sun, Nov 26 2023 7:07 PM | Last Updated on Mon, Nov 27 2023 1:04 PM

IND VS AUS 2nd T20, Thiruvananthapuram: Updates And Highlights - Sakshi

బ్యాటర్ల ఊచకోత.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. బ్యాటర్లంతా రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్‌ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్‌ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్‌ (9 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్‌ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్‌; సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. 

అనంతరం 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ ఆదిలో కాస్త పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో భిష్ణోయ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కూడా టీమిండియానే విజయం​ సాధించిన విషయం తెలిసిందే. 

ఓటమి అంచుల్లో ఆసీస్‌
236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ ఆదిలో కాస్త పోరాడినప్పటికీ, ఆతర్వాత భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆ జట్టు 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది.అర్షదీప్‌ బౌలింగ్‌లో ఆడమ్‌ జంపా (1) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

నిప్పులు చెరుగుతున్న ప్రసిద్ద్‌ కృష్ణ
టీమిండియా పేసర్‌ ప్రసిద్ద్‌ కృష్ణ నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను మూడో వికెట్‌ పడగొట్టాడు. 152 పరుగుల వద్ద నాథన్‌ ఇల్లిస్‌ (1)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

ఓటమి దిశగా ఆసీస్‌.. సీన్‌ అబాట్‌ క్లీన్‌ బౌల్డ్‌
ఆసీస్‌ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 149 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో సీన్‌ అబాట్‌ (1) క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
148 పరుగుల వద్ద ఆసీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. గుర్తింపు పొందిన ఆఖరి బ్యాటర్‌ స్టోయినిస్‌ (45) ఔటయ్యాడు. ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి స్టోయినిస్‌ పెవిలియన్‌కు చేరాడు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
139 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. రవి భిష్ణోయ్‌ బౌలింగ్‌లో టిమ్‌ డేవిడ్‌ (37) ఔటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 142/5గా ఉంది. స్టోయినిస్‌ (43), వేడ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు.

టార్గెట్‌ 236.. భారత్‌కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్‌
236 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆసీస్‌.. టీమిండియాకు ధీటుగా బదులిస్తుంది.12 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. స్టోయినిస్‌ (40), టిమ్‌ డేవిడ్‌ (31) చెలరేగి ఆడుతున్నారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
53 పరుగుల వద్ద ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ (12) ఔటయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 53/3గా ఉంది. స్టోయినిస్‌, స్టీవ్‌ స్మిత్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు

టార్గెట్‌ 236.. రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌
236 పరుగుల అతి భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్‌ 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రవి భిష్ణోయ్‌.. జోస్‌ ఇంగ్లిస్‌ (2), మాథ్యూ షార్ట్‌ను (19) పెవిలియన్‌కు పంపాడు. 

టీమిండియా బ్యాటర్ల మహోగ్రరూపం.. సిక్సర్ల సునామీ
ఆసీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు మహోగ్రరూపం దాల్చారు. టాప్‌-3 బ్యాటర్లు మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్‌ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

సూర్యకుమార్‌ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు), రింకూ సింగ్‌ (9 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) , తిలక్‌ వర్మ (2 బంతుల్లో 7 నాటౌట్‌; సిక్స్‌) సైతం మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. ఆసీస్‌ బౌలర్లలో ఇల్లిస్‌ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోయినిస్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

ఇషాన్‌ ఔట్‌
52 పరుగుల వద్ద ఇషాన్‌ కిషన్‌ ఔటయ్యాడు. స్టోయినిస్‌ బౌలింగ్‌లో ఇల్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన స్కై తొలి బంతికే సిక్సర్‌ బాదాడు.

దంచికొడుతున్న ఇషాన్‌
యశస్వి జైస్వాల్‌ ఔటయ్యాక కూడా భారత బ్యాటర్లు జోరు కొనసాగిస్తున్నారు. ఇషాన్‌ కిషన్‌ (52) విధ్వంసం ఓ రేంజ్‌లో కొనసాగుతుండగా.. రుతురాజ్‌ (47) ఆచితూచి ఆడుతున్నాడు. 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 164/1గా ఉంది.

10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన భారత్‌
టీమిండియా 10 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. యశస్వి ధాటిగా ఆడి ఔటైనా రుతురాజ్‌ (29), ఇషాన్‌ కిషన్‌ (10) కూడా ఓ మోస్తరు షాట్లు ఆడి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 10 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 101/1గా ఉంది.

విధ్వంసం సృష్టించి ఔటైన యశస్వి
యశస్వి జైస్వాల్‌  క్రీజ్‌లో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించాడు. అయితే ఐదో ఓవర్‌ ఆఖరి బంతికి అతనికి అడ్డుకట్ట పడింది. ఇల్లిస్‌ బౌలింగ్‌ యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాడు. 5.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 77/1గా ఉంది. రుతురాజ్‌ (15), ఇషాన్‌ క్రీజ్‌లో ఉన్నారు.

యశస్వి ఊచకోత.. 24 బంతుల్లోనే..!
యశస్వి జైస్వాల్‌ ఉగ్రరూపం దాల్చాడు. వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా బాదేస్తున్నాడు. కేవలం 24 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు.

యశస్వి జైస్వాల్‌ ఉగ్రరూపం
సీన్‌ అబాట్‌ వేసిన నాలుగో ఓవర్‌లో యశస్వి జైస్వాల్‌ ఉగ్రరూపం దాల్చాడు. వరుసగా మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. 

తొలి బంతికే ఫోర్‌ బాదిన రుతురాజ్‌
తొలి టీ20లో బంతిని ఎదుర్కోకుండానే డైమండ్‌ రనౌట్‌గా వెనుదిరిగిన రుతురాజ్‌ ఈ మ్యాచ్‌లో తానెదుర్కొన్న తొలి బంతికే బౌండరీ బాదాడు. తొలి ఓవర్‌ తర్వాత టీమిండియా స్కోర్‌ 10/0గా ఉంది. రుతురాజ్‌ (5), యశస్వి జైస్వాల్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. 

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 26) రెండో టీ20 జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించగా.. ఆసీస్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. బెహ్రాన్‌డార్ఫ్‌, ఆరోన్‌ హార్డీ స్థానాల్లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా ఆసీస్‌ జట్టులోకి వచ్చారు.   

టీమిండియా: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్‌), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా: స్టీవెన్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ వేడ్(కెప్టెన్‌), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement