మనం నమ్ముకున్న ‘స్పిన్’ మంత్రం మనకే బెడిసి కొట్టింది. రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను కూల్చేసింది. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు పరుగు ముందే టీమిండియా ఆలౌటైంది. అక్షర్ పటేల్, అశ్విన్ ఆదుకోకుంటే మాత్రం పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా ఉండేది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ దాకా ప్రధాన బ్యాటర్లను లయన్ తిప్పేస్తుంటే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆపద్భాంధవుడి పాత్ర పోషించాడు.
న్యూఢిల్లీ: ఎవరి ఊహకు అందనంతగా స్పిన్ తిరుగుతోంది. మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. రెండు రోజుల్లోనే 21 వికెట్లు కూలాయి. ఇందులో 16 వికెట్లు స్పిన్నర్లవే! ప్రత్యేకించి రెండో రోజు ఆటలో పడిన 11 వికెట్లలో 10 వికెట్లు స్పిన్నర్లే పడేశారు. దీంతో ఢిల్లీ టెస్టు రసవత్తరంగా మారింది. మిగిలిన మూడు రోజుల ఆటలో గెలుపు ఎటు మళ్లుతుందో చెప్పలేని స్థితి!
టీమిండియాకు ఎదురులేని ఢిల్లీ కోటలో ఆస్ట్రేలియా ‘స్పిన్’తో ప్రతిదాడి చేసింది. దీంతో రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 83.3 ఓవర్లలో 262 పరుగుల వద్ద ఆలౌటైంది. లోయర్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. ఆసీస్ స్పిన్నర్లలో లయన్ (5/67) చెలరేగాడు. కున్‌మన్, మర్పీలకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది.
లయన్ ఉచ్చులో...
ఓవర్‌నైట్ స్కోరు 21/0తో శనివారం ఆట కొనసాగించిన భారత్ 7 ఓవర్లపాటు బాగానే ఆడింది. కున్‌మన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ లాంగాన్ లో భారీ సిక్సర్ బాదాడు. ఇక ఓపెనర్లు కుదురుకున్నట్లే అనుకుంటున్న తరుణంలో లయన్ బౌలింగ్‌కు దిగాడు. తన రెండు వరుస ఓవర్లలో టాపార్డర్‌ను ఎల్బీడబ్ల్యూగా దెబ్బ మీద దెబ్బ తీశాడు. ముందుగా రాహుల్ (17; 1 సిక్స్)ను బోల్తా కొట్టించిన లయన్ తన మరుసటి ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ (32; 2 ఫోర్లు), 100వ టెస్టు ఆడుతున్న పుజారా (0)లను పెవిలియన్ చేర్చాడు. ఇంకో ఓవర్లో అయ్యర్ (4) ఆట ముగించడంతో భారత్ 66 పరుగులకే 4 ప్రధాన వికెట్లను కోల్పోయింది. కోహ్లి క్రీజులో ఉండటమే జట్టుకు కాస్త ఊరట కాగా 88/4 స్కోరు వద్ద తొలి సెషన్ ముగిసింది.
అక్షర్ వీరోచితం
లంచ్ తర్వాత కోహ్లి, జడేజా జాగ్రత్తగా ఆడటంతో భారత్ వంద పరుగులు పూర్తి చేసుకుంది. అనంతరం స్పిన్నర్లు మర్ఫీ, కున్‌మన్ కలిసి భారత్‌ను పెద్ద దెబ్బే కొట్టారు. జడేజా (26; 4 ఫోర్లు)ను మర్ఫీ, కోహ్లి (44; 4 ఫోర్లు)ని కున్‌మన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నారు. శ్రీకర్ భరత్ (6) లయన్ ఉచ్చులో చిక్కాడు. 139/7 స్కోరు వద్ద భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే అశ్విన్ (37; 5 ఫోర్లు) అండతో అక్షర్ జట్టును ఒడ్డున పడేశాడు. అక్షర్ 94 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా... ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు దాకా వెళ్లగలిగింది.
వార్నర్ కన్‌కషన్
ఆసీస్ స్టార్ ఓపెనర్ వార్నర్ రెండో టెస్టు మిగతా ఆటకు దూరమయ్యాడు. తొలిరోజు ఆటలోనే సిరాజ్ పదో ఓవర్లో వార్నర్ మోచేతికి గాయమైంది. కాసేపు ఫిజియో సేవలతో బ్యాటింగ్ చేశాడు. అయితే గాయం తీవ్రత దృష్ట్యా టెస్టు నుంచి తప్పుకోగా... కన్‌కషన్ (ఆటలో గాయమైతేనే) సబ్‌స్టిట్యూట్‌గా రెన్‌షాను తీసుకున్నారు. మూడో టెస్టుకల్లా వార్నర్ కోలుకునేది అనుమానంగానే ఉంది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 263; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) లయన్ 32; రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 17; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 0; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) కున్‌మన్ 44; అయ్యర్ (సి) హ్యాండ్స్‌కాంబ్ (బి) లయన్ 4; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) మర్ఫీ 26; శ్రీకర్ భరత్ (సి) స్మిత్ (బి) లయన్ 6; అక్షర్ (సి) కమిన్స్ (బి) మర్ఫీ 74; అశ్విన్ (సి) రెన్‌షా (బి) కమిన్స్ 37; షమీ (బి) కున్‌మన్ 2; సిరాజ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (83.3 ఓవర్లలో ఆలౌట్) 262.
వికెట్ల పతనం: 1–46, 2–53, 3–54, 4–66, 5–125, 6–135, 7– 139, 8–253, 9–259, 10–262.
బౌలింగ్: కమిన్స్ 13–2–41–1, కున్‌మన్ 21.3– 4–72–2, లయన్ 29–5–67–5, మర్ఫీ 18–2–53–2, హెడ్ 2–0–10–0.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: ఖాజా (సి) అయ్యర్ (బి) జడేజా 6; హెడ్ (బ్యాటింగ్) 39; లబుషేన్ బ్యాటింగ్ 16; మొత్తం (12 ఓవర్లలో వికెట్ నష్టానికి) 61.
వికెట్ల పతనం: 1–23.
బౌలింగ్: అశ్విన్ 6–1–26–0, షమీ 2–0–10–0, జడేజా 3–0–23–1, అక్షర్ 1–0–2–0.
Comments
Please login to add a commentAdd a comment