ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ చరిత్ర సృష్టించాడు. భారతగడ్డపై అత్యధిక వికెట్లు (టెస్ట్‌ల్లో) పడగొట్టిన విదేశీ బౌలర్‌గా ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ డెరెక్ అండర్‌వుడ్ (16 టెస్ట్‌ల్లో 54 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో కేఎస్ భరత్ (44) వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ రేర్ ఫీట్ సాధించాడు.
ప్రస్తుతం లియోన్ ఖాతాలో 55 వికెట్లు (11 టెస్ట్‌ల్లో) ఉన్నాయి. భారతగడ్డపై లియోన్ ఐదుసార్లు ఐదు వికెట్ల ఘనతను, ఓ సారి 10 వికెట్లు ఫీట్‌ను సాధించాడు. లియోన్, అండర్‌వుడ్ తర్వాత భారత గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ల జాబితాలో రిచీ బెనాడ్ (52), కోట్నీ వాల్ష్ (43), ముత్తయ్య మురళీథరన్ (40) మూడు నుంచి ఐదు స్థానాల్లో నిలిచారు.
భారత్‌పై అత్యంత విజయవంతమైన స్పిన్నర్‌గా..
ప్రస్తుత భారత పర్యటనలో చెలరేగిపోతున్న నాథన్ లియోన్.. పలు ఆసక్తికర రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు. భారతగడ్డపై అత్యధిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ రికార్డుతో పాటు భారత్‌పై అత్యంత విజయవంతమైన స్పిన్నర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా భారత్‌పై 26 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన లియోన్.. 9 సార్లు ఐదు వికెట్ల ఘనతతో పాటు 2 సార్లు 10 వికెట్ల ఘనత సాధించి 115 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
భారతపై ఏ స్పిన్నర్ ఇన్ని వికెట్లు పడగొట్టలేదు. అలాగే భారత్‌పై అత్యధిక ఫైఫర్‌లు సాధించిన బౌలర్‌గాను లియోన్ రికార్డు నెలకొల్పాడు. భారత్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లియోన్‌కు ముందు ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (139) మాత్రమే ఉన్నాడు. BGT-2023లో భీకర ఫామ్‌లో ఉన్న లియోన్.. 4 టెస్ట్‌ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా లియోన్ ఖాతాలో 480 వికెట్లు (119 టెస్ట్‌ల్లో) ఉన్నాయి.
ఇందులో 23 సార్లు ఐదు వికెట్ల ఘనత, 4 సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లియోన్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (685), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (576), మెక్‌గ్రాత్ (563), వాల్ష్ (519) వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 519 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (169), అక్షర్ పటేల్ (57) క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు.
Comments
Please login to add a commentAdd a comment