India Vs Australia T20 Series: ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఓటమి నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్ల తీరుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో కొంతమంది ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించకుండా రోజురోజుకీ లావైపోతున్నారని వ్యాఖ్యానించాడు.
అధిక బరువుతో బాధపడుతున్నారని.. ప్రస్తుతం టీమిండియా కంటే కూడా మిగతా ఆసియా జట్ల క్రికెటర్లు ఫిట్‌గా కనిపిస్తున్నారని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా మినహా మిగతా ఆటగాళ్లంతా ఫిట్‌నెస్‌ను సీరియస్‌గా తీసుకున్నట్లు లేదని సల్మాన్ అభిప్రాయపడ్డాడు.
కాగా మొహాలీలో ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. చెత్త ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా.. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ మెరుపులు వృథాగా పోయాయి.
కోహ్లి, పాండ్యా మినహా..
ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో భారత్ ఫీల్డింగ్ చేసిన తీరు విమర్శలకు దారి తీసింది. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కీలక సమయంలో క్యాచ్‌లు మిస్ చేయడంతో టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సల్మాన్ భట్ మాట్లాడుతూ.. ‘‘ఎంత మంది నాతో ఏకీభవిస్తారో తెలియదు కానీ.. నా అభిప్రాయం ప్రకారం టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్ మాత్రం మరీ అంత గొప్పగా ఏమీ లేదు.
విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా మినహా ఎవరూ ఫిట్‌గా కనిపించడం లేదు. నిజానికి ప్రపంచంలోనే అత్యధిక పేమెంట్ అందుకుంటున్నది టీమిండియా ఆటగాళ్లే! ఎప్పుడూ ఏదో ఒక సిరీస్‌తో బిజీగా ఉంటారు. వరుసగా మ్యాచ్‌లు ఆడుతూ ఉంటారు.
రోహిత్, రిషభ్ వంటి ఆటగాళ్లు..
కానీ ఇప్పుడు వాళ్ల ఫిట్‌నెస్ స్థాయికి తగ్గట్టు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లతో పోలిస్తే టీమిండియా ఆటగాళ్లు వెనకబడి ఉన్నారు. అంతెందుకు ఇతర ఆసియా జట్టు సైతం ఈ విషయంలో భారత్ కంటే ఓ అడుగు ముందే ఉన్నాయి.
కొంతమంది భారత ఆటగాళ్లు ఉండాల్సిన దాని కన్నా ఎక్కువ బరువు ఉన్నారు. విరాట్ కోహ్లి ఫిట్‌నెస్‌కు మారుపేరులా నిలిస్తే.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ మైదానంలో చురుగ్గా కదల్లేక బద్దకంగా కనిపిస్తున్నారు. వాళ్లు పూర్తి ఫిట్‌గా ఉంటే మాత్రం ప్రమాదకర బ్యాటర్లుగా మారతారడనడంలో సందేహం లేదు’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: Kohli-Ashneer Grover: కోహ్లిని కలిసిన వివాదాస్పద పారిశ్రామికవేత్త
Ind Vs Aus 2nd T20: ‘ఆరెంజ్ సిటీ’లో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment