దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని టీమిండియాలో అడుగుపెట్టిన ఆకాశ్ దీప్.. పేస్ దళంలో స్థానం సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయితే, కెరీర్ ప్లాన్ చేసుకునే విషయంలో తానేమీ తొందరపడటం లేదని.. మెరుగ్గా రాణిస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని పేర్కొన్నాడు. ఇప్పుడే పెద్ద పెద్ద సిరీస్‌లు ఆడాలనే కోరిక కూడా తనకు లేదన్నాడు.
అరంగేట్రంలోనే రాణించి
బిహార్‌లో జన్మించిన ఆకాశ్ దీప్.. డొమెస్టిక్ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో సత్తా చాటిన ఈ రైటార్మ్ మీడియం పేసర్‌కు ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా టీమిండియా సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాంచిలో ఇంగ్లిష్ జట్టుతో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లతో సత్తా చాటాడు.
ఇక తాజాగా సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఆకాశ్ దీప్.. చెన్నై మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి పేస్ దళంలో భాగమైన ఆకాశ్.. రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో కాన్పూర్‌లో జరిగే రెండో టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.
వర్తమానంలో బతకడం నాకిష్టం.. ఆ ఆశ లేదు
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆకాశ్ దీప్‌నకు ఆస్ట్రేలియా జరుగనున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టులో చోటు గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను కెరీర్ ప్లానింగ్ విషయంలో కన్ఫ్యూజ్ కాకూడదు. రంజీలతో పోలిస్తే.. ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాబట్టి నేను ఆస్ట్రేలియాకు వెళ్లాలి. ఇంకెక్కడికో ప్రయాణించాలని నా మీద ఒత్తిడి పెట్టుకోలేను.
ప్రస్తుతం నా దృష్టి ఆట మీదే
వర్తమానంలో బతకడం నాకిష్టం. తర్వాత ఏం జరుగుతుందో చూసుకోవచ్చు. గత రెండేళ్లలో నేను చాలా క్రికెట్ ఆడాను. మాకు కేవలం 2-3 నెలలపాటే షెడ్యూల్ ఉండదు. రంజీ.. తర్వాత దులిప్ ట్రోఫీ.. ఆ తర్వాత ఇరానీ కప్.. ఇలా ఎప్పుడూ ఏదో ఒక టోర్నీ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడునైపుణ్యాలు మెరుగుపరచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి ఉంది’’ అని 27 ఏళ్ల ఆకాశ్ దీప్ తన మనసులోని మాట వెల్లడించాడు.
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా నవంబరులో అక్కడికి వెళ్లనుంది. అప్పటికి భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. ఆకాశ్ దీప్‌నకు ఛాన్స్ రాకపోవచ్చు.
చదవండి: బంగ్లాతో టీ20 సిరీస్: టీమిండియా మెరుపు సెంచరీ వీరుడి ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment