Jaydev Unadkat Plays Test Cricket After 12 Years: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 22) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేస్తున్న భారత్.. ఈ మ్యాచ్ కోసం ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది.
12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఉనద్కత్‌తో పాటు ఉమేశ్ యాదవ్ (3/20), రవిచంద్రన్ అశ్విన్ (2/68) రాణించడంతో బంగ్లాదేశ్ 69 ఓవర్ల తర్వాత 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. మొమినుల్ హాక్ (82 నాటౌట్) అజేయమైన అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
అతని జతగా తస్కిన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నాడు. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
కాగా, అనూహ్య పరిణామాల మధ్య ఈ మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఓ అసాధారణ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2010లో తొలి టెస్ట్ (సౌతాఫ్రికా) ఆడిన ఉనద్కత్.. 12 ఏళ్ల తర్వాత రెండో టెస్ట్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పార్థివ్ పటేల్ పేరిట ఉండేది. పార్థివ్.. 8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.
ఈ రికార్డుతో పాటు ఉనద్కత్ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. అత్యధిక టెస్ట్ మ్యాచ్‌ల గ్యాప్ తర్వాత టెస్ట్‌ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో ఉనద్కత్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో గారెత్ బ్యాటీ (142 టెస్ట్‌లు, 2005-16) అగ్రస్థానంలో ఉండగా.. ఉనద్కత్ (118 టెస్ట్‌లు, 2010-22) రెండో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత మార్టిన్ బిక్నెల్ (114, 1993-2003), ఫ్లాయిడ్ రీఫర్ (109, 1999-2009), యూనిస్ అహ్మద్ (104, 1969-87), డెరెక్ షాక్లెటన్ (103, 1951-63) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో నిలిచారు.
ఇదిలా ఉంటే, బంగ్లా టూర్‌కు తొలుత ఎంపికైన మహ్మద్ షమీ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో ఉనద్కత్ జట్టులోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శన (10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు) ఆధారంగా సెలెక్టర్లు అతనికి అవకాశం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment