వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమానంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు.
చేతన్ శర్మ తర్వాత ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత సీమన్‌గా రికార్డుల్లోకెక్కాడు. 1986లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో చేతన్ శర్మ 188 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టగా.. ఈ మ్యాచ్‌లో బుమ్రా 91 పరుగులు సమర్పించుకుని 9 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలు బుమ్రా కెరీర్‌లో రెండో అత్యుత్తమ గణాంకాలు కూడా కావడం విశేషం. అతని కెరీర్ బెస్ట్ గణాంకాలను 2018లొ మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై (9/86) సాధించాడు.
ఓవరాల్‌గా బుమ్రా తన కెరీర్‌లో తొమ్మిది సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. బుమ్రా 33 టెస్ట్‌ల్లో 20.82 సగటున 146 వికెట్లు పడొట్టాడు. రెండో టెస్ట్‌లో బుమ్రా ఒంటిచేత్తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను తనాతునకలు చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బుమ్రా చేసిన విన్యాసాలు భారత క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతాయి.
ఈ మ్యాచ్‌లో బుమ్రాతో పాటు యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కూడా టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించారు. జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో (209) చెలరేగగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో గిల్ సెంచరీతో (104) కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సమిష్టిగా రాణించి తమ జట్టుకు అపురూప విజయాన్ని అందించారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. జైస్వాల్ విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో జైస్వాల్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. రోహిత్ 14, శుభ్‌మన్ గిల్ 34, శ్రేయస్ 27, రజత్ పాటిదార్ 32, అక్షర్ పటేల్ 27, కేఎస్ భరత్ 17, అశ్విన్ 20, బుమ్రా 6, ముకేశ్ కుమార్ 0 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, బషీర్, రెహాన్ తలో 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (76) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 6, కుల్దీప్ 3, అక్షర్ ఓ వికెట్ పడగొట్టారు. 143 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 255 పరుగులు చేసి ఆలౌటైంది. ఫామ్ లేమితో సతమతమవుతున్న గిల్ ఎట్టకేలకు సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 4, రెహాన్ 3, ఆండర్సన్ 2, బషీర్ ఓ వికెట్ పడగొట్టారు.
399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 292 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో 3 వికెట్లు, ముకేశ్, కుల్దీప్, అక్షర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment