ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన టీమిండియా.. ఇప్పుడు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టులో తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టాలని భారత జట్టు కసితో ఉంది. తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని తమ ఆస్త్రాలను సిద్దం చేసుకుంటుంది.
మరోవైపు ఇంగ్లీష్ జట్టు మాత్రం తొలి మ్యాచ్ ఫలితాన్నే వైజాగ్ టెస్టులోనూ రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే విశాఖకు చేరుకున్న ఇరు జట్లు బుధవారం నుంచి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గోనున్నాయి. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు తన అమ్మమ్మ ఇలాఖాలో మరోసారి కఠిన పరీక్ష ఎదురుకానుంది.
మ్యాచ్‌కు ముందే ఎదురు దెబ్బలు..
ఇక రెండో టెస్టు ఆరంభానికి ముందే భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. తొలి టెస్టులో గాయపడిన స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా.. ఇప్పుడు వైజాగ్ టెస్టుకు దూరమయ్యారు. వారి స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వారిద్దరి లేని లోటు తీర్చలేనది. ఎందుకంటే తొలి టెస్టులో జడ్డూ, రాహుల్ ఇద్దరూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా జడ్డూ బ్యాట్‌తో పాటు బాల్‌తోనూ సత్తాచాటాడు.
మొదటి టెస్టులో 89 పరుగులతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు రెండో టెస్టుకు జడ్డూ స్ధానాన్ని ఎవరూ భర్తీ చేస్తారన్నది అందరి మొదడలను తొలుస్తున్న ప్రశ్న. తొలి మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమైన కుల్దీప్‌కు అవకాశమిస్తారో లేదా సౌరభ్ కుమార్, వాషింగ్టన్‌లో ఎవరైనా జట్టులోకి వస్తారో వేచి చూడాలి. ఒక వేళ కుల్దీప్ జట్టులోకి వస్తే కేవలం బౌలింగ్ పరంగా మంచి ఎంపికైనప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం అంతంత మాత్రమే.
రజిత్ పాటిదార్ అరంగేట్రం..?
ఇక కేఎల్ రాహుల్ స్ధానంలో రజిత్ పాటిదార్ లేదా సర్ఫరాజ్ ఖాన్‌లలో ఎవరో ఒకరు టెస్టు క్రికెట్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. వీరిద్దరూ దేశవాళీ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తున్నారు. అయితే మేనెజ్‌మెంట్ మాత్రం పాటిదార్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఏదైమనప్పటికీ రాహుల్ వంటి సీనియర్ ఆటగాడి స్ధానాన్ని పాటిదార్ ఎంతవరకు న్యాయం చేస్తాడన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 55 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్.. 4000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 12 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
విరాట్ కోహ్లి వచ్చేది ఎప్పుడు?
ఇక తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లేని లోటు స్పష్టంగా కన్పించింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నప్పుడు.. కోహ్లి వంటి ఆటగాడు జట్టులో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.
వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు విరాట్ దూరమయ్యాడు. అయితే సిరీస్ మొత్తానికి కూడా విరాట్ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కోహ్లి సిరీస్ మొత్తానికి దూరమైతే భారత్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
గిల్, అయ్యర్ ఫామ్‌లోకి వస్తారా?
రెండో టెస్టులో అందరి కళ్లు టీమిండియా ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ పైనే ఉంటాయి. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన వీరిద్దరూ వైజాగ్ టెస్టులోనైనా తిరిగి వారి రిథమ్‌ను పొందాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గత కొంత కాలంగా టెస్టుల్లో శ్రేయస్ పర్వాలేదన్పిస్తున్నప్పటికీ.. గిల్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు.
మొదటి టెస్టులో కేవలం 23 పరుగులు మాత్రమే శుబ్‌మన్ చేశాడు. గత 9 ఇన్నింగ్స్‌లలో గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. గిల్ జట్టులో తన స్ధానాన్ని నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా బ్యాట్‌కు పనిచెప్పాల్సిందే.
రికార్డు మనదే..
ఇక విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో టీమిండియా ఓటమనేదే ఎరుగదు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ భారత్ ఘన విజయం సాధించింది.
2016లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 246 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (167), పుజారా (119) సెంచరీలతో . అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ సహా ఎనిమిది వికెట్లతో (మ్యాచ్‌లో) ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. అదే విధంగా 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ 203 పరుగులు తేడాతో టీమిండియా భారీ విజయం అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment