Ind vs Eng: బ్యాటింగ్‌లో విఫలమైనా.. అద్భుత క్యాచ్‌తో మెరిసి.. | Ind vs Eng 2nd Test Vizag Day 2 Iyer Brilliant Catch Dismiss Dangerous Crawley | Sakshi
Sakshi News home page

Ind vs Eng: బ్యాటింగ్‌లో విఫలమైనా.. అద్భుత క్యాచ్‌తో మెరిశాడు

Published Sat, Feb 3 2024 3:45 PM | Last Updated on Sat, Feb 3 2024 4:05 PM

Ind vs Eng 2nd Test Vizag Day 2 Iyer Brilliant Catch Dismiss Dangerous Crawley - Sakshi

అద్భుత డైవ్‌తో క్యాచ్‌ అందుకున్న టీమిండియా స్టార్‌ (PC: BCCI

India vs England, 2nd Test: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. బంతిని సరిగ్గా అంచనా వేసి డైవ్‌ చేసి మరీ ఒడిసిపట్టి భారత శిబిరంలో నవ్వులు నింపాడు. కాగా హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిన టీమిండియా.. విశాఖపట్నంలో రెండో మ్యాచ్‌లో తలపడుతోంది.

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ(209) కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది.

బ్యాటింగ్‌లో విఫలం
అయితే, ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ విఫలమయ్యాడు. 59 బంతులు ఎదుర్కొన్న ఈ నాలుగో నంబర్‌ బ్యాటర్‌ కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. తద్వారా జట్టుతో పాటు అభిమానులనూ నిరాశపరిచాడు.

అయితే, రెండో రోజు ఆటలో భాగంగా శనివారం సూపర్‌ క్యాచ్‌ అందుకుని ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 23వ ఓవర్‌ను టీమిండియా స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ వేశాడు.

డైవ్‌ చేసి.. క్యాచ్‌ పట్టి
అతడి బౌలింగ్‌లో రెండో బంతికి ఫోర్‌ బాదిన ఇంగ్లిష్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలే.. మరుసటి బాల్‌కు కూడా షాట్‌ ఆడాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి గాల్లోకి లేవగా బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌ వెనక్కి పరుగెత్తి.. డైవ్‌ చేసి క్యాచ్‌ పట్టాడు. 

దీంతో 76 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ప్రమాదకరంగా మారుతున్న జాక్‌ క్రాలే కథ ముగిసింది. రెండో వికెట్‌ దక్కడంతో టీమిండియాలో సంబరాలు మొదలయ్యాయి. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ క్యాచ్‌ అందుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘బ్యాటింగ్‌తో కాకపోయినా.. ఫీల్డింగ్‌తోనైనా జట్టులో చోటిచ్చినందుకు కనీస న్యాయం చేస్తున్నావు’’ అంటూ సెటైరికల్‌గా ప్రశంసిస్తున్నారు.

చదవండి: Ind vs Eng: పుజారా అక్కడ దంచికొడుతున్నాడు.. జాగ్రత్త: గిల్‌కు మాజీ కోచ్‌ వార్నింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement