India Vs England 3rd T20 2021 Live Updates And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

మూడో టీ20‌‌: బట్లర్‌ మెరుపులు.. ఇంగ్లండ్‌ సునాయాస విజయం‌‌‌

Published Tue, Mar 16 2021 6:44 PM | Last Updated on Sat, Mar 20 2021 5:03 PM

Ind vs Eng: Toss, Live Updates For 3rd T20 - Sakshi

బట్లర్‌ మెరుపులు.. ఇంగ్లండ్‌ సునాయాస విజయం
రెండో టీ20లో ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్‌ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో ఆ జట్టు టీమిండియాపై 8 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (52 బంతుల్లో 83; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులకు బెయిర్‌ స్టో(28 బంతుల్లో 40; 5 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ తోడవ్వడంతో ఇంగ్లండ్‌ జట్టు 18.2 ఓవర్లలో భారత్‌ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. భారత బౌలర్లలో చహల్‌, సుందర్‌లకు తలో వికెట్‌ దక్కింది. దీంతో 5 టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 ఇదే వేదికగా మార్చి 18న జరుగనుంది. 

గెలుపు దిశగా ఇంగ్లండ్
ఇంగ్లండ్‌ జట్టు సునాయాస గెలుపు దిశగా పయనిస్తుంది. 15 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి125 పరుగులు సాధించింది. ఆ జట్టు విజయానికి 30బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. క్రీజ్‌లో బట్లర్‌(78), బెయిర్‌ స్టో(14) ఉన్నారు.

13 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 107/2. ఇంగ్లండ్ విజయానికి 42 బంతుల్లో 50 పరుగులు సాధించాల్సి ఉంది. క్రీజ్‌లో బట్లర్‌(66), బెయిర్‌ స్టో(6) ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌..మలాన్‌(18) ఔట్
హార్డ్‌ హిట్టర్‌ డేవిడ్‌ మలాన్‌ 17 బంతుల్లో సిక్సర్‌ సాయంతో 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరుకున్నాడు. సుందర్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ పంత్‌ అద్భుతమైన స్టంపింగ్‌ చేయడంతో మలాన్‌ వెనుతిరగక తప్పలేదు. క్రీజ్‌లో బట్లర్‌(54), బెయిర్‌ స్టో(1) ఉన్నారు.

బట్లర్‌ హాఫ్‌ సెంచరీ 
టీమిండియా బౌలర్లపై జోస్‌ బట్లర్‌ విరుచుకుపడుతున్నాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీని పూర్తి చేశాడు. దీంతో 8.5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 72 పరుగులుగా ఉంది. బట్లర్‌కు తోడుగా క్రీజ్‌లో మలాన్‌(14 బంతుల్లో 10) ఉన్నాడు. 

ధాటిగా ఆడుతున్న బట్లర్‌.. 5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్‌ 46/1
ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(14 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడుతున్నాడు. అతని ధాటికి 5 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 46 పరుగులు సాధించింది. బట్లర్‌కు తోడుగా క్రీజ్‌లో మలాన్‌(3) ఉన్నాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. రాయ్‌(9) ఔట్‌
చహల్‌ బౌలింగ్‌లో రోహిత్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(13 బంతుల్లో 9; 2 ఫోర్లు) పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో 3.3 ఓవర్లు తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 23/1. క్రీజ్‌లోకి డేవిడ్‌ మలాన్‌ వచ్చాడు.

కట్టుద్టింగా బౌలింగ్‌ చేస్తున్న టీమిండియా పేసర్లు
2 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్‌ 7/0. రాయ్‌(6), బట్లర్‌(1) క్రీజ్‌లో ఉన్నారు. భువనేశ్వర్‌ కుమార్‌, శార్ధూల్‌ తలో ఓవర్‌ బౌల్‌ చేశారు.

బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌
157 పరుగుల టార్గెట్ ఛేదించేందుకు ఇంగ్లండ్ జట్టు బరిలోకి దిగింది. టీమిండియా బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ బంతిని అందుకోగా.. ఇంగ్లండ్‌ ఓపెనర్లు జేసన్‌ రాయ్‌, జోస్‌ బట్లర్‌లు బరిలోకి దిగారు.

ఇంగ్లండ్‌ టార్గెట్ 157
చివర్లో కోహ్లి, పాండ్యా దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. కెప్టెన్‌ కోహ్లి(46 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత అర్ధశతకంతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆఖర్లో పాండ్యా(14 బంతుల్లో 17; 2 సిక్సర్లు‌) తనవంతు పాత్రను పోషించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 3, క్రిస్‌ జోర్డాన్‌ 2 వికెట్లు దక్కించుకున్నారు. 

మూడో టీ20 అప్‌డేట్స్‌‌:   కోహ్లి హాఫ్‌ సెంచరీ, 17 ఓవర్ల తర్వాత టీమిండియా 114/5
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(37 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అర్ధశతకం బాదాడు. కోహ్లితో పాటు హార్ధిక్‌ పాండ్యా(8 బంతుల్లో 4) క్రీజ్‌లో ఉన్నాడు.

మూడో టీ20 అప్‌డేట్స్‌‌:  9 పరుగులకు అయ్యర్ అవుట్.. 14.3 ఓవర్ల తర్వాత 86/5‌
ఆచితూచి ఆడిన అయ్యర్‌ 9 పరుగుల వద్ద మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో మలాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయ్యర్‌ 9 బంతుల్లో ఫోర్‌ సాయంతో 9 పరుగులు చేశాడు.

కోహ్లి అత్యుత్సాహం..పంత్ ‌(25) రనౌట్‌
లేని పరుగుకోసం ప్రయత్నించి రిషబ్‌ పంత్‌ రనౌటయ్యాడు. కెప్టెన్ కోహ్లి పిలుపు మేరకు అనవసరపు పరుగు కోసం ప్రయత్నించిన పంత్‌ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 11.4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్‌ 64/4.

10 ఓవర్ల తర్వాత టీమిండియా 55/3
క్రీజ్‌లో కోహ్లి(14 బంతుల్లో 14; 2 ఫోర్లు), పంత్‌(16 బంతుల్లో 20; 3 ఫోర్లు).

8 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 38/3
క్రీజ్‌లో కోహ్లి(10 బంతుల్లో 11; 2 ఫోర్లు), పంత్‌(8 బంతుల్లో 7; ఫోర్లు)

మూడో వికెట్‌ డౌన్‌.. ఇషాన్‌ కిషన్‌(4) ఔట్‌.. 5.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 24/3
తొలి మ్యాచ్లో అర్ధసెంచరీతో ఇరగదీసిన ఇషాన్‌ కిషన్‌ రెండో మ్యాచ్‌లో కేవలం 9 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ బాట పట్టాడు. ఇషాన్‌.. క్రిస్‌ జోర్డాన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

మరో వికెట్‌ డౌన్‌.. రోహిత్‌ శర్మ(15) అవుట్‌
టీమిండియా బ్యాట్స్‌మెన్లు వరుసపెట్టి పెవిలియన్‌ బాట పడుతున్నారు. ఆపదలో ఆదుకుంటాడనుకున్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ(17 బంతుల్లో 15; 2 ఫోర్లు) మార్క్‌ వుడ్‌ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

టీమిండియాకు షాక్‌.. రాహుల్‌ మరోసారి డకౌట్‌
టీమిండియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్ కేఎల్‌ రాహుల్‌(0) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌటయ్యాడు. మార్క్‌ వుడ్ బౌలింగ్‌లో రాహుల్‌ క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. 2.3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 1/7.

తొలి ఓవర్‌ తర్వాత భారత్‌ 0/5
టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆచితూచి ఆడుతుంది. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్లు కేఎల్‌ రాహుల్‌(0)‌, రోహిత్‌ శర్మ(5 బంతుల్లో 4) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ అటాక్‌ను స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌తో మొదలుపెట్టింది.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్‌ ఓడి.. ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగింది. తొలి మ్యాచ్‌లో టాపార్డర్‌ చేతులెత్తేయడంతో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా.. వెంటనే రెండో మ్యాచ్‌లో కోలుకొని ప్రత్యర్ధిపై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సత్తా చాటింది. అదే ఊపులో ఈ మ్యాచ్‌లో కూడా విజయఢంకా మోగించి, సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని టీమిండియా పట్టుదలగా ఉంది. మరోవైపు గత మ్యాచ్‌ అనుభవంతో ఇంగ్లండ్‌ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో తమ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని ధృడసంకల్పంతో ఉంది. ఈ నేపథ్యంలో టాప్‌–2 జట్ల మధ్య మరో ఆసక్తికర పోరు సాగనుంది.

కాగా, ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. టీమిండియా సూర్యకుమార్‌ స్థానంలో రోహిత్‌ను ఆడించనుండగా, ఇంగ్లండ్ జట్టులో టామ్‌ కర్రన్‌ స్థానంలో మార్క్‌ వుడ్‌కు చాన్స్ దక్కింది.

ప్రేక్షకులు లేకుండానే..
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత మరోసారి పెరుగుతుండటంతో చివరి మూడు టీ20లను ప్రేక్షకలు లేకుండానే నిర్వహించాలని గుజరాత్‌ క్రికెట్‌ సంఘం నిర్ణయం తీసుకుంది. కాగా, తొలి రెండు మ్యాచ్‌లకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించిన సంగతి తెలిసిందే. 

తుది జట్లు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, రాహుల్‌, కిషన్, పంత్, అయ్యర్, హార్దిక్, సుందర్, శార్దుల్, భువనేశ్వర్, చహల్‌. 
ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, వుడ్‌, సామ్‌ కర్రన్‌, ఆర్చర్, రషీద్, జోర్డాన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement