లార్డ్స్: చారిత్రక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ కోహ్లి స్పందించాడు. ‘తీవ్రమైన ఒత్తిడి మధ్య రెండో ఇన్నింగ్స్‌లో చాలా బాగా ఆడాం. బుమ్రా, షమీ అయితే అద్భుతం. 60 ఓవర్లలో ఫలితం రాబట్టడం మా లక్ష్యం. మైదానంలో వారి ఆటగాళ్లతో జరిగిన వాదనలు మాలో మరింత దూకుడును పెంచాయి. 2014లోనూ లార్డ్స్‌లో గెలిచినా...60 ఓవర్లలోపే విజయాన్ని అందుకోవడం ఎంతో ప్రత్యేకం. ఇక్కడ తొలి సారి టెస్టు ఆడిన సిరాజ్ బౌలింగ్ చేసిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడకు వచ్చి మాలో స్ఫూర్తి నింపిన భారత అభిమానులకు ఈ విజయం ఒక కానుక’ అని తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ నిర్దేశించిన లక్ష్యం 272. రెండు సెషన్లు, 60 ఓవర్లు. ఓపెనింగ్ సహా టాపార్డర్ నిలబడితే, దీనికి వేగం జతయితే ఓవర్‌కు 4 పరుగులు చేయడం ఏమంత కష్టం కాదు. కానీ బుమ్రా, షమీ వారికి ఆ అవకాశమే ఇవ్వలేదు. ఇద్దరు ప్రారంభ ఓవర్లలోనే బర్న్స్ (0), సిబ్లీ (0)లను ఖాతా తెరువనీయలేదు. వీళ్లిద్దరికి తోడుగా ఇషాంత్ దెబ్బ మీద దెబ్బ తీశాడు. హమీద్ (9), బెయిర్ స్టో (2)ల పనిపట్టాడు. కెప్టెన్ రూట్ (60 బంతుల్లో 33; 5 ఫోర్లు) జట్టును కాపాడాలనుకున్నా బుమ్రా ఆ అవకాశం అతనికి ఇవ్వలేదు. ఈ స్థితిలో డ్రా చేసుకోవడం కూడా ఇంగ్లండ్‌కు కష్టమే! అయినా సరే బట్లర్ (96 బంతుల్లో 25; 3 ఫోర్లు) ప్రయత్నిద్దామనుకున్నాడు. కానీ సీన్‌లోకి ఈ సారి సిరాజ్ వచ్చాడు. వరుస బంతుల్లో మొయిన్ అలీ (13), స్యామ్ కరన్ (0)లను ఔట్ చేశాడు. తర్వాత బట్లర్‌ను తనే పెవిలియన్ చేర్చాడు. ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌లిచ్చారు. డ్రాతో గట్టెక్కాల్సిన చోట గెలుపు సంబరమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment